ఓయ్ నిన్నే

  • October 6, 2017 / 10:00 AM IST

కొత్త టాలెంట్ ను మన తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంది. అలా వచ్చిన సరికొత్త సినిమానే “ఓయ్ నిన్నే”. సత్య చల్లకోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో హర్ష-సృష్టి జంటగా పరిచయమయ్యారు. పల్లెటూరి ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 6) విడుదలైంది. వేరే చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రిలీజవ్వకపోవడంతో ఏమాత్రం బాగున్నా కనీస స్థాయి కలెక్షన్స్ అందిపుచ్చుకోగల అవకాశం పుష్కలంగా ఉన్న “ఓయ్ నిన్నే” ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ : విష్ణు (భరత్) ఓ సాధారణ పల్లెటూరి యువకుడు, చిన్నప్పట్నుంచి తన మావ కూతురు, మరదలు అయిన వేద (సృష్టి) డామినేషన్ భరించలేక ఇంటికి దూరంగా స్నేహితులకు దగ్గరగా పెరుగుతాడు. ఉద్యోగం కంటే తన తాతయ్య పొలం దున్నుకొని సంతోషంగా బ్రతకడానికే ప్రాధ్యన్యత ఇచ్చే విష్ణు అంటే తండ్రి శేఖరానికి (నాగినీడు) చిన్నచూపు. అందుకే సొంత కొడుక్కంటే ఎక్కువగా మేనకోడలు వేదను చూసుకొంటుంటాడు. బావామరదళ్ళైనప్పటికీ విష్ణు-వేద ఎప్పుడూ ఒకర్నొకరు తిట్టుకుంటూనే ఉంటారు. ఒకానొక సందర్భంలో వేదకు విష్ణుతో కాక వేరే సంబంధం చేద్దామని శేఖరం ఫిక్స్ అవ్వడంతో.. అప్పటికి వేదపై మనసున్నప్పటికీ తండ్రి మీద గౌరవంతో తన మనసులోని ప్రేమను బయటపెట్టడు. అయితే.. వేద కూడా విష్ణును ప్రేమిస్తుందన్న విషయం కాస్త లేట్ గా తెలుసుకొన్న శేఖరం.. తాను స్వయంగా సెట్ చేసిన పెళ్లిని చెడగొట్టలేక, వారిని విడగొట్టలేక సతమతమవుతున్న తరుణంలో ఎంటరవుతాడు మన తాగుబోతు రమేష్. తాగుగోతు రమేష్ ఎంట్రీతో విష్ణు-వేద జీవితాల్లో వచ్చిన మార్పేమిటి? చివరికి ఇద్దరూ పెళ్లాడారా? లేదా? అనేది సినిమా ఇతివృత్తం.

నటీనటుల పనితీరు : పరిచయ చిత్రమే అయినప్పటికీ.. కథానాయకుడిగా భరత్ పర్వాలేదనిపించుకొన్నాడు. డ్యాన్సుల విషయంలో తేలిపోయాడే కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో పర్లేదనిపించాడు. డైలాగ్స్ చాలా చోట్ల లిప్ సింక్ కుదరలేదు. తదుపరి చిత్రంలో ఈ విషయాలను పరిగణలోకి తీసుకొంటే కథానాయకుడిగా కంటే నటుడిగా భరత్ కు మంచి భవిష్యత్ ఉంది. రెగ్యులర్ ఫార్మాట్ హీరోయిన్ లా సన్నగా రివటలా కాకుండా బొద్దుగా-ముద్దుగా అచ్చమైన పల్లెటూరి యువతిగా సృష్టి ఆకట్టుకొంది. అయితే.. హావభావాల విషయంలో మాత్రం అమ్మడు కాస్త విసిగించింది. సత్య కామెడీ అలరించింది. ఇంటికి వెళ్ళి హీరోయిన్ తో తాగేసి గొడవపడే సన్నివేశం బాగా పేలింది. బాధ్యతగల తండ్రి పాత్రలో నాగినీడు ఆకట్టుకొన్నారు, తనికెళ్లభరణి, తాగుబోతు రమేష్, తులసి వంటి ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రఘుబాబు, ప్రగతి సపోర్టింగ్ రోల్స్ లో పర్లేదనిపించారు.

సాంకేతికవర్గం పనితీరు : శేఖర్ చంద్ర గీతాలు కొత్తగా లేకపోయినా.. వాటి చిత్రీకరణ సహజంగా ఉండడంతో ఆడియన్స్ కు ఓ మోస్తరుగా నచ్చుతాయి. సాహిత్యం అర్ధవంతంగా ఉంది. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.పల్లెటూరి అందాలను వీలైనంత సహజంగా తెరకెక్కించారు. సినిమాలో చెప్పుకోదగ్గ ఏకైక ప్లస్ పాయింట్స్ లో సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఒకటి. హీరో ఇంట్రో సాంగ్ మినహా మిగతావన్నీ మాంటేజ్ సాంగ్స్ కావడం సినిమాకి ప్లస్ పాయింట్. అయితే.. ఎడిటింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉండుంటే బాగుండేది, డ్రాగ్ ఎక్కువయ్యింది. అనవసరమైన సన్నివేశాలు చాలా ఎక్కువున్నాయి. వాటిని ఏమైనా ఎడిట్ చేస్తే ఆడియన్స్ బోర్ ఫీలవ్వకుండా ఉంటారు.

దర్శకుడు సత్య కథ మీద కంటే కథనం మీద ఎక్కువ శ్రద్ధ చూపాడు. అందువల్ల క్యారెక్టర్స్ అర్ధమైన రీతిలో కథకి రీచబిలిటీ ఉండదు. అదే విధంగా సాగతీత ఎక్కువైన కారణంగా కథకి ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. ముఖ్యంగా.. హీరోహీరోయిన్ల నడుమ ప్రేమ ఎప్పుడు చిగురించింది, ఎందుకు కారణాలేమిటి అనేది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు, సో వీళ్ళేప్పుడు ప్రేమించుకోవడం మొదలెట్టారు అనే విషయంలో ఆడియన్స్ కి కూడా క్లారిటీ ఉండదు. సో ఈ మైనర్ మైనస్ పాయింట్స్ ను పక్కన పెడితే సినిమా ఓవరాల్ గా పర్లేదు అనిపిస్తుంది.

విశ్లేషణ : రెగ్యులర్ అండ్ రొటీన్ సినిమాలతో పోల్చి చూస్తే “ఓయ్ నిన్నే” సినిమా పర్లేదనిపిస్తుంది. ఈ శుక్రవారం వేరే సినిమాల్లేకపోవడం, సినిమా కూడా ఓ మోస్తరుగా బాగానే ఉండడంతో కాస్త పబ్లిసిటీ చేస్తే సినిమాకి కనీస స్థాయి కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా చూడ్డానికి అలవాటుపడిన సగటు సినిమా అభిమాని “ఓయ్ నిన్నే” చిత్రాన్ని నిరభ్యంతరంగా సాదరాగా ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus