తెలంగాణ సినిమా నేపథ్యంలో వచ్చిన సరికొత్త చిత్రం “పైలం పిలగా” (Pailam Pilaga) . సాయితేజ, పావని (Pavani Karanam), డబ్బింగ్ జానకి (Dubbing Janaki) ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రానికి ఆనంద్ గుర్రం దర్శకుడు. రీజనల్ కంటెంట్ సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న తరుణంలో వచ్చిన ఈ “పైలం పిలగా” ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: కోతుల గుట్టకు చెందిన శివ (సాయితేజ కల్వకోట) దుబాయ్ వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటాడు. అందుకోసం రెండు లక్షల రూపాయలు అవసరమవుతాయి. ఆ డబ్బు కోసం నానా కష్టాలు పడుతుండగా.. నానమ్మ శాంతి (డబ్బింగ్ జానకి) తనకు కట్నంగా వచ్చిన రెండెకరాల పొలం పేపర్లు ఇస్తుంది. అయితే.. ఆ పొలం ఎక్కడుంది? ఆ పొలం కారణంగా శివ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఇంతకీ శివ తాను కోరుకున్నట్లుగా సెటిల్ అవ్వగలిగాడా? అనేది “పైలం పిలగా” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: ఇదివరకు పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ & సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన సాయితేజ కల్వకోట ఈ సినిమాలో హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొంతమేరకు అలరించాడనే చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్ లో ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన సగటు యువకుడిగా మంచి నటన కనబరిచాడు. దేవి పాత్రలో పావని స్వచ్ఛమైన తెలంగాణ యువతి పాత్రలో ఒదిగిపోయింది. ఈ తరహా సినిమాలకు స్పష్టమైన తెలంగాణ యాసలో తెలుగు భాష మాట్లాడే అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.
అలాగే.. సీనియర్ నటి అయిన డబ్బింగ్ జానకి చాన్నాళ్ల తర్వాత మంచి పాత్రలో కనిపించారు. నానమ్మ పాత్రలో ఆమె నటన సినిమాకి మంచి ప్లస్ పాయింట్ గా నిలిచింది. ప్రణవ్ సోను, మిర్చి కిరణ్ (Mirchi Kiran), చిత్రం శ్రీను ( Chitram Seenu) తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: నిజానికి టెక్నికల్ గా సినిమా గురించి గొప్పగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. యశ్వంత్ నాగ్ సంగీతం ఒక్కటే చెప్పుకోదగ్గ విషయం. సినిమాటోగ్రఫీ వర్క్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ, ఆర్ట్ వర్క్ పెద్దగా ఏమీ లేదు. అయితే.. దర్శకుడు మరియు రచయిత ఆనంద్ గుర్రం ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాలి. తనకు లభించిన అతితక్కువ బడ్జెట్ లో ఒక కాన్సెప్ట్ సినిమాను డీసెంట్ గా తెరకెక్కించాడు. మంచి ఎమోషన్స్ రాసుకున్నాడు, సమాజంలోని మరీ ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో జరిగే అవినీతిని వేలెత్తి చూపించాడు.
అయితే అక్కడ కూడా ఎవర్నీ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయలేదు. మరీ ముఖ్యంగా తెలంగాణా సినిమా అనే పేరుతో మందు సీన్లు, బూతులతో సినిమాని నింపడానికి అస్సలు ప్రయత్నించలేదు. అందువల్ల “పైలం పిలగా” ఒక డీసెంట్ సినిమాగా మిగిలింది. సో, దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు ఆనంద్ గుర్రం.
విశ్లేషణ: కొన్ని సినిమాలు పాయింట్ వైజ్ గా చూసుకుంటే భలే అనిపిస్తాయి కానీ.. సినిమాగా కొంచం బోర్ కొడతాయి. “పైలం పిలగా” కూడా ఆ జాబితా సినిమానే. సినిమాలో మంచి పాయింట్ ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి పాత్రలున్నాయి. కానీ వాటిని ప్యాకేజ్ గా తీర్చిదిద్దన విధానం మాత్రం అలరించలేకపోయింది. అందువల్ల సినిమా ఎంత నిజాయితీగా ఉన్నా.. రెండు గంటలపాటు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడంలో విఫలమైంది.
ఫోకస్ పాయింట్: పిల్లగాని ప్రయత్నం మంచిదే కానీ..!!
రేటింగ్: 2/5