“ప్రతిరోజూ పండగే, మంచి రోజులొచ్చాయి” లాంటి కమర్షియల్ హిట్స్ అనంతరం మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “పక్కా కమర్షియల్”. తొలుత ఈ చిత్రానికి హీరోగా రవితేజను అనుకున్నప్పటికీ.. రవితేజ తప్పుకోవడంతో గోపీచంద్ హీరోగా తెరపైకి వచ్చాడు. మరి మారుతి తన ఫార్మాట్ కామెడీతో పక్కా కమర్షియల్ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!
కథ: తండ్రి సత్యనారాయణ మూర్తి (సత్యరాజ్) నుండి ఒక్క నిజాయితీ తప్ప అన్నీ గుణాలు పుణికిపుచ్చుకున్న వివేక్ (గోపీచంద్) కేవలం డబ్బు కోసమే లాయర్ గా పనిచేస్తూ.. అడ్డమైన కేసులు వాదించి, తప్పు చేసివాళ్లను కాపాడుతూ లక్షలు సంపాదిస్తుంటాడు.
నిక్కచ్చితనానికి మారుపేరైన సత్యనారాయణ మూర్తి, కొడుకు పద్ధతి చూసి తట్టుకోలేక.. జడ్జ్ గా తీసుకున్న రిటర్మెంట్ ను పక్కనపెట్టి లాయర్ గా రీఎంట్రీ ఇచ్చి, కొడుకు వాదిస్తున్న కేస్ కి సవాలు విసురుతాడు.
అసలు తండ్రీకొడుకులు తలపడే స్థాయికి తీసుకొచ్చిన కేస్ ఏమిటి? ఎవరు గెలిచారు? ఎవరు గెలవాల్సి వచ్చింది? అనేది “పక్కా కమర్షియల్” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: వరుసబెట్టి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. గోపీచంద్ కు ఒక పక్కా కమర్షియల్ హిట్ పడి చాలా ఏళ్ళయ్యింది. 2014లో వచ్చిన “లౌక్యం” తర్వాత గోపీచంద్ కు సరైన విజయం లేదనే చెప్పాలి. అలాగే.. గోపీచంద్ ను ఓ కామెడీ రోల్లో చూసి కూడా చాలా ఏళ్లయ్యింది. ఈ రెండు కోరికల్ని తీర్చేసే సినిమా “పక్కా కమర్షియల్”. కంత్రీ లాయర్ గా, తండ్రి పట్ల విపరీతమైన గౌరవం కలిగిన కొడుకుగా వివేక్ పాత్రలో ఒదిగిపోయాడు గోపీచంద్. అలాగే.. “జిల్” తర్వాత గోపీచంద్ కు మళ్ళీ చక్కని మేకోవర్ ఇచ్చిన సినిమా కూడా ఇదే. డ్యాన్సులు, ఫైట్లు మాత్రమే కాక.. కామెడీ టైమింగ్ తో విశేషంగా ఆకట్టుకున్నాడు గోపీచంద్.
“ప్రతిరోజూ పండగే” తర్వాత మళ్ళీ ఆ తరహా పాత్రలోనే అతి తెలివి అమ్మాయి పాత్రలో రాశిఖన్నా.. గ్లామర్ తో, యాక్టింగ్ తో ఆకట్టుకుంది.
సత్యరాజ్ మరోమారు తన సీనియారిటీ ప్రూవ్ చేసుకున్నారు. అజయ్ ఘోష్, సప్తగిరి, రావు రమేష్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రావు రమేష్ ను స్టైలిష్ గా చూపించారు కానీ.. ఆయన విలనిజాన్ని ఎలివేట్ చేసిన విధానం మాత్రం బాలేదు.. అందువల్ల ఆ క్యారెక్టర్ సగం ఉడికిన బియ్యంలా ఉండిపోయింది.
సాంకేతికవర్గం పనితీరు: జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం, కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. సినిమా కంటెంట్ తో సంబంధం లేకుండా తమ బెస్ట్ ఇచ్చారు ఇద్దరు. సినిమాలో డల్ మూమెంట్స్ చాలా ఉన్నప్పటికీ.. తమ పనితనంతో సినిమాను గట్టెక్కించారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. కంటెంట్ నీడ్ కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టారు.
దర్శకుడు మారుతి నుండి జనాలు ఎలాంటి సినిమాను ఆశిస్తారో.. సరిగ్గా అలాంటి సినిమానే “పక్కా కమర్షియల్”. ఓపెనింగ్ బాగుంటుంది, విజువల్స్ రిచ్ గా ఉంటాయి, కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. అయితే.. కథనం మాత్రం చుట్టేస్తాడు. ఇప్పటివరకూ మారుతి తీసిన సినిమాల్లో “ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్” మినహా మరే సినిమాలోనూ అలరించే కథనం కనిపించదు. నిజానికి మారుతి సినిమాలు, కథనాలు చాలా ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి. అందువల్ల ఆసక్తి సన్నగిల్లుతుంది.
“పక్కా కమర్షియల్” విషయంలోనూ అదే జరిగింది. సినిమా విజువల్ గా బాగుంటుంది కానీ.. కంటెంట్ మిస్ అవుతుంది. చక్కని క్యాస్టింగ్ & క్రూ ఉన్నప్పటికీ.. కథనాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వలన హిట్ అవ్వాల్సిన సినిమాలు యావరేజ్ గా మిగిలిపోతున్నాయి. తదుపరి ప్రభాస్, చిరంజీవి సినిమాల విషయంలోనైనా మారుతి కథనం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలని కోరుకుందాం.
విశ్లేషణ: “ఒకసారి హ్యాపీగా థియేటర్లలో చూడవచ్చు” అనే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఇప్పటి పరిస్థితుల్లో తప్పే.. ఎందుకంటే ప్రస్తుత టికెట్ రేట్స్ & ఒటీటీ రిలీజ్ గ్యాప్ ను దృష్టిలో పెట్టుకొని.. సినిమా అసాధారణంగా ఉంటే తప్ప ప్రేక్షకుడు థియేటర్లో కాలు పెట్టడం లేదు. “పక్కా కమర్షియల్”లో ఆకట్టుకునే, అలరించే అంశాలు ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మాత్రం సంతుష్టపరచలేదనే చెప్పాలి. అయితే.. కామెడీ కోసం సినిమాను చూడొచ్చు!
రేటింగ్: 2.5/5