తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కోలీవుడ్ హీరోగా విశాల్ పరిచయమయ్యారు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతూ విజయం సాధిస్తోంది. విశాల్ కి తెలుగులో గుర్తింపును తీసుకొచ్చిన సినిమా పందెం కోడి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 2005 లో రిలీజ్ అయి తెలుగులో భారీ కలక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుకున్నమూవీ పందెం కోడి 2.
ఇందులోనూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఫైట్స్ భారీగానే ఉన్నట్టు నేడు రిలీజ్ అయిన టీజర్ స్పష్టం చేసింది. అరసు కంపోజ్ చేసిన ఫైట్స్ ఆశ్చర్య పరుస్తున్నాయి. “నేను ఆడుకోవడం మొదలు పెట్టలేదు… అడ్డుకోవడమే మొదలు పెట్టాను ..”, “ఇది పులి మేక ఆట కాదు.. పులి మేక కలిసి ఆడే ఆట” అనే డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచింది. మహానటి సినిమా ద్వారా తెలుగు, తమిళంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటించడం అదనపు ఆకర్షణ కానుంది. వరలక్ష్మి కీలకరోల్ పోషించిన ఈ సినిమాని లింగుస్వామి తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించిన ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.