Pani Review in Telugu: పని సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • జోజు జార్జ్ (Hero)
  • అభినయ (Heroine)
  • సాగర్ సూర్య, జునైజ్ తదితరులు.. (Cast)
  • జోజు జార్జ్ (Director)
  • ఎం.రియాజ్ ఆడమ్, సిజో వడక్కన్ (Producer)
  • సామ్ సి.ఎస్, సంతోష్ నారాయణన్, విష్ణు విజయ్ (Music)
  • వేణు (Cinematography)
  • Release Date : డిసెంబర్ 13, 2024

మలయాళంలో మంచి విజయం సాధించిన “పని” చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదరూపంలో విడుదల చేసారు. ఈ సినిమాకి మలయాళంలో మాత్రమే కాక తమిళనాట కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ నమ్మకంతోనే తెలుగులోనూ ఇవాళ (డిసెంబర్ 13) విడుదల చేశారు. జోజు జార్జ్ ప్రధాన పాత్ర పోషించడమే కాక దర్శకత్వం కూడా వహించిన ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Pani Review in Telugu

కథ: డాన్ సెబాస్టియన్ (సాగర్ సూర్య), సిజు (జునైజ్) డబ్బుల కోసం హత్యలు చేయడం మొదలెడతారు. రోడ్డు మీద గౌరి (అభినయ)ను చూసి మోజుపడి ఆమెతో అసభ్యంగా బిహేవ్ చేయగా, ఆమె భర్త గిరి (జోజు జార్జ్) వాళ్లకి బుద్ధి చెబుతాడు. దాంతో కోపం పెంచుకున్న డాన్ & సిజు ఏం చేశారు? వాళ్లను గిరి ఎలా ఎదుర్కొన్నాడు? ఆ కారణంగా ఏం కోల్పోయాడు? వాళ్ల హత్యాకాండకు తెరపడిందా? అనేది “పని” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: అందరూ తమ తమ పాత్రల్లో నటించారు కానీ అందరికంటే ఎక్కువగా కష్టపడి నటించింది మాత్రం అభినయ. ఆమెపై చిత్రీకరించిన సన్నివేశంలో నటించడానికి డేర్ ఉండాలి. నటిగా ఆమెకు ఈ సినిమా ఎలాంటి హెల్ప్ చేస్తుందో తెలియదు కానీ, చాలా రిస్క్ చేసిందని చెప్పాలి.

సైకోలుగా సాగర్ సూర్య, జునైజ్ జీవించేశారు. వాళ్ల కళ్ళల్లో ఏ ఒక్క సన్నివేశంలోనూ భయం కనిపించదు, క్రిమినల్ మైండ్ సెట్ గురించి డీటెయిలింగ్ బాగుంది. జోజు జార్జ్ కు చాలా పరిమితమైన స్క్రీన్ స్పేస్ తీసుకున్నాడు. అయితే.. కనిపించిన కాసిన్ని సన్నివేశాల్లో కళ్లతోనే నటించేశాడు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు కమ్ హీరో జోజు జార్జ్ చాలా సాధారణమైన కథను తన డైరెక్షనల్ డెబ్యూ కోసం ఎంచుకోవడం అనేది గమనార్హం. అయితే.. టెక్నికల్ గా మాత్రం ఎక్కడా రాజీపడలేదు. ప్రతి సన్నివేశం చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఛేజింగ్ సీన్ ను కంపోజ్ చేసిన విధానం మంచి హై ఇస్తుంది. కానీ.. ఒక దర్శకుడిగా అభినయపై చిత్రించిన మానభంగం సన్నివేశాన్ని ఎందుకని మలయాళ, తమిళ విశ్లేషకులు తీవ్రంగా ఖండించారు అనేది సినిమా చూసాక అర్థమవుతుంది. 2024లోనూ మానభంగాన్ని ఇంత పచ్చిగా చూపించాల్సిన అవసరం లేదు.

విలనిజం ఎలివేట్ చేయడం కోసం ఇలాంటి సీన్స్ ను రాయడం అనేది మంచిది కాదు. ఆ తీవ్రతను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ.. ఎందుకో కాస్త ఇబ్బందికరంగానే ఆ సన్నివేశాన్ని తెరకెక్కించాడు జోజు. ఈ విషయంలో కాస్త సెన్సిబుల్ గా ఆలోచించి, ఆ సన్నివేశాన్ని డీల్ చేసి ఉంటే అతడి దర్శకత్వ ప్రతిభ మరింతగా ఎలివేట్ అయ్యేది. అలాగే.. మరో రెండు శృంగార సన్నివేశాల విషయంలోనూ కాస్త బోర్డర్ దాకా వచ్చేశాడు. అందుకే ఒక ఫిలిం మేకర్ గా కమర్షియల్ సక్సెస్ అందుకన్నా.. రెస్పెక్ట్ మాత్రం పొందలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, స్టంట్స్, ప్రొడక్షన్ డిజైన్ & క్యాస్టింగ్ మొత్తం బాగుంది.

విశ్లేషణ: హీరో-విలన్ తన్నుకు చావడానికి ఓ ఆడదాన్ని బలిపశువును చేయడం అనేది ఎప్పడూ కరెక్ట్ కాదు. ముఖ్యంగా మోడ్రన్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ లోనూ ఇలాంటి 80ల నాటి కథ-కథనాలతో ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేయడం అనేది భావ్యం కాదు. మరి జోజు జార్జ్ తన దర్శకత్వంలో తెరకెక్కే తదుపరి చిత్రంతోనైనా తన ధోరణి మార్చుకుంటాడేమో చూడాలి.

ఫోకస్ పాయింట్: స్టైలిష్ విజువల్స్ ఉన్నా.. కంటెంట్ లో ఎమోషన్ కొరవడింది!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus