Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • NA (Hero)
  • అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత (Heroine)
  • రాగ్ మయూర్, రాజేంద్రప్రసాద్, హర్ష వర్ధన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Cast)
  • ప్రవీణ్ కండ్రేగుల (Director)
  • శ్రీనివాసులు పి.వి - విజయ్ డొంకాడ - శ్రీధర్ మక్కువ (Producer)
  • గోపి సుందర్ (Music)
  • మృదుల్ సుజిత్ సేన్ (Cinematography)
  • ధర్మేంద్ర కాకరాల (Editor)
  • Release Date : ఆగస్ట్ 22, 2025
  • ఆనంద మీడియా (Banner)

అనుపమ పరమేశ్వరన్ ఎన్నో ఆశలు పెట్టుకుని, తనకు వీలైంతలో భారీగా ప్రమోట్ చేసిన సినిమా “పరదా”. ఓ కల్పిత ఆచారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి “సినిమా బండి, శుభం” చిత్రాల దర్శకుడు ప్రవీణ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగింది? నటిగా అనుపమకు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వగలిగిందా? అనేది చూద్దాం..!!

Paradha Movie Review

కథ: పడతి అనే గ్రామంలో వయసుకొచ్చిన ఆడపిల్లలందరూ పరదా వేసుకోవాలి అనే ఆచారాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు. ఒక వయసుకి వచ్చిన అమ్మాయి గనుక పరదా లేకుండా తండ్రి/భర్త కాకుండా పరాయి మగాడికి కనబడితే గనుక ఆమెను గ్రామ దేవత జ్వాలమ్మ సాక్షిగా ఆత్మాహుతికి అంకితం ఇవ్వడం అనేది పడతి గ్రామం ఆచరించే కట్టుబాట్లలో ముఖ్యమైనది.

అలాంటి ఆచారాన్ని ఊహించని విధంగా, తన తప్పులేకపోయినా సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు సుబ్బుకి వచ్చిన కష్టం ఏమిటి? అందుకు కారణం ఎవరు? ఈ క్రమంలో సుబ్బుకి అత్తమ్మ (సంగీత), ఢిల్లీలో ఉండే అమ్మాయి అమిష్టా (దర్శన రాజేంద్రన్) ఎలా సహాయపడ్డారు? అనేది “పరదా” చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు: అనుపమ పరమేశ్వరన్ కథను నమ్మడం వల్లనో లేక ఓన్ చేసుకోవడం వల్లనో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓ సాధారణ యువతికి ఉండే భయాలు, బాధ్యతలను ఆమె తెరపై ప్రెజెంట్ చేసిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా సెకండాఫ్ లో “ఇది నన్ను కాపాడాలి” కదా అంటూ పరదాను పట్టుకొని ఏడ్చే సీన్ లో అనుపమ బేలతనం, కోపం కలగలిసిన ఎమోషన్ ను అత్యద్భుతంగా పండించింది. “ఫ్రీడం @ మిడ్ నైట్” తర్వాత అనుపమలోని నటిని పూర్తిగా వినియోగించుకున్న చిత్రం “పరదా” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇండిపెండెంట్ ఉమెన్ గా ఆమె పాత్ర బాగుంది. ఆమె స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

సీనియర్ హీరోయిన్ సంగీత మరోసారి తన సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నారు. సగటు గృహిణిగా ఆమె ఒదిగిపోగా, కొన్ని డైలాగ్స్ & హర్షవర్ధన్ తో ఫోన్ కాల్ సీన్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

రాగ్ మయూర్ తనదైన శైలి నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మగాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది అతడి పాత్ర ద్వారా చెప్పిన సన్నివేశం హత్తుకుంటుంది. అలాగే.. హర్షవర్ధన్ కామెడీ సీన్స్ ఓ మోస్తరుగా నవ్విస్తాయి.

చిన్న పాత్రే అయినప్పటికీ రాజేంద్రప్రసాద్ సీన్స్ ఆకట్టుకోగా.. అతిథి పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ మృదుల్ సేన్ పనితనాన్ని మెచ్చుకోవాలి. వీలైనంత సహజంగా తెరకెక్కించే ప్రయత్నం చేసింది. లొకేషన్స్ అన్నీ ఒరిజినల్ అవ్వడం, గ్రీన్ మ్యాట్ యూసేజ్ అనేది లేకపోవడం వల్ల విజువల్ గా ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వలేదు.

గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం బాగున్నా.. ఒక్కటే థీమ్ మ్యూజిక్ బదులు వేరే థీమ్స్ యూజ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ కి “యాత్ర నార్యస్తూ” బీజియం ఎక్కువగా రిపీట్ చేశారు అనిపించింది.

ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, సీజీ వంటి టెక్నికాలిటీస్ అన్నీ బాగున్నాయి.

ఇక ఈ సినిమా కథను రాసింది ప్రవీణ్ అయినప్పటికీ.. పూజిత, ప్రహాస్ లు కూడా రైటింగ్ పరంగా ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే.. కృష్ణ ప్రత్యూష ఈ చిత్రానికి స్క్రిప్ట్ డాక్టర్/క్రియేటివ్ హెడ్ గా వ్యవహరించింది. అందువల్ల కథనం విషయంలో దొర్లిన తప్పులకు ఎవరికి క్రెడిట్ ఇవ్వాలో అర్థం కావడం లేదు. ప్రవీణ్ రాసుకున్న కథలో విషయం ఉంది. కానీ.. ఆ కథను నడిపించిన విధానంలోనే ఎమోషన్ లోపించింది. జ్వాలమ్మ జాతర ఎపిసోడ్ తో కథను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగున్నా.. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ ను కన్సీవ్ చేసిన విధానం అలరించలేకపోయింది. అయితే.. మగాడి రెగ్యులర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది హర్షవర్ధన్ పాత్ర సోఫాపై ప్లేట్లో చేయి కడుక్కునే సీన్ మరియు రాగ్ మయూర్ రైల్వే స్టేషన్ లో మ్యాగజైన్ చూసి ఈర్ష్యపడే సన్నివేశాలను రాసుకున్న విధానం బాగుంది. ఇలా అక్కడక్కడా వచ్చే సన్నివేశాలు బాగున్నా.. ఓవరాల్ గా మాత్రం సినిమాలో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఎమోషన్ అనేది లోపించింది. ముగ్గురు ఆడవాళ్లు ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు.. కుదిరితే వాళ్లు తమలో కుచించుకుపోయిన స్వాతంత్ర్యపు గుర్తుల్ని నెమరువేసుకొని, తాము పోగొట్టుకుంటున్నది ఇదా? అని రియలైజ్ అవ్వాలి లేదంటే.. ఆ ప్రయాణంలో తమకు తెలియని తమలోని కోణాన్ని పరిచయం చేసుకొని పరిపక్వత చెందాలి. ఈ రెండూ కాకుండా వేరే కోణంలో సినిమాని తీయకూడదు అనే రూల్ ఏమీ లేదు కానీ.. ఏదో ఒక రియలైజేషన్ పాయింట్ ఉండాలి కదా. ఇప్పుడు “పరదా” తనను కాపాడలేకపోయింది అని అనుపమ రియలైజ్ అయ్యే సన్నివేశంలో ఉన్న డెప్త్ సినిమాకి చాలా చోట్ల అవసరం. ఆ డెప్త్ కానీ, ఎమోషన్ కానీ సినిమాలో చాలా చోట్ల లోపించింది. అందువల్ల సినిమా అంతా చాలా పేలవంగా ఉంటుంది.

దర్శకుడిగా ప్రవీణ్ కి చాలా ఆలోచనలు ఉన్నాయి. పడతి అనే గ్రామం నుంచి ధర్మశాల వరకు అన్నిటిలే బాగా డిజైన్ చేసుకున్నాడు. అయితే.. సినిమా చూస్తున్న జనాలకి వచ్చే రెగ్యులర్ డౌట్స్ ను క్లారిఫై చేయడంలో తడబడ్డాడు. మరీ ముఖ్యంగా.. క్లైమాక్స్ ను మరీ సింపుల్ గా ముగించేశాడు అనిపించింది. ఆ ఊర్లో ఉన్న జనాల మెంటాలిటీకి, ఆ బర్నింగ్ ఇష్యూకి “అనుకోకుండా ఒకరోజు” తరహా ఎండింగ్ ను ప్లాన్ చేసి ఉండొచ్చు. మరి పోలికలు వస్తాయి అనుకున్నాడో లేక కొత్తగా ఉంటుంది అనుకున్నాడో చాలా సింపుల్ గా ముగించేశాడు. దర్శన రాజేంద్రన్ పాత్ర ఒక సాధారణ మహిళ గొప్పతనాన్ని రియలైజ్ అయ్యే సన్నివేశంలో ఆమె నిజంగా రియలైజ్ అయ్యిందా లేదా అనే క్లారిటీ లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. సినిమాలో కంటెంట్ ఉన్నా, ఆ కంటెంట్ ను కమాండ్ చేసే ఎమోషన్ మిస్ అయ్యింది.

విశ్లేషణ: ఒక కొత్త పాయింట్ ను, కొత్తగా, ఆలోచింపజేసే విధంగా చెప్పాలి అనుకోవడం ప్రశంసార్హం. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన “ఇరైవి” చూసినప్పుడు ఆడవాళ్ల ఎమోషన్స్ ను ఇలా కూడా చెప్పొచ్చా? అని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. అదే స్థాయిలో కాకపోయినా ఒక కంప్లీట్ డిఫరెంట్ సబ్జెట్ తీసుకున్నప్పుడు, అదే స్థాయి డిఫరెంట్ ట్రీట్మెంట్ ను కూడా ఆశిస్తారు ప్రేక్షకులు. ఒక అనుకోని సమస్య సినిమాలోని కీలకపాత్రధారికి ఎదురైనప్పుడు, ఆ సమస్య నుండి అతడు/ఆమె ఎలా బయటపడతారు అని సినిమా చూస్తున్న ప్రేక్షకులు మదనపడాలి. కానీ.. “పరదా” విషయంలో అది జరగలేదు. పైన పేర్కొన్నట్లు దర్శకరచయితలకు బోలెడు ఆలోచనలు ఉన్నా.. ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చిన తీరు అలరించలేకపోయింది. ఆ కారణంగా తెలుగులో ఒక మైలురాయి చిత్రంగా నిలవాల్సిన “పరదా” ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.

ఫోకస్ పాయింట్: ఆలోచనల వరదను.. ఒడిసిపట్టలేకపోయిన పరదా!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus