Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

బైక్‌ మీద డ్రైవింగ్‌ చేసినప్పుడు హెల్మెట్‌ పెట్టుకుంటే ప్రాణానికి రక్షణ అని తెలుసు కానీ.. సినిమా టికెట్లు ఇస్తారని తెలియదు అంటారా? ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటిది జరగలేదు కానీ.. తాజాగా తమిళనాడులో ఓ స్వచ్ఛంద సంస్థ ఈ పని చేసింది. తమిళనాడులోని తంజావూర్‌ నగర పోలీసు విభాగంతో కలసి ఆ స్వచ్ఛంద సంస్థ గత కొన్నాళ్లుగా హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సినిమా టికెట్లతో తాజా అవేర్‌నెస్‌ కార్యక్రమం చేపట్టింది.

Parasakthi Movie

తంజావూర్‌లో ప్రస్తుతం 70 శాతం మంది టూవీలర్‌ రైడర్స్‌ హెల్మెట్‌లు పెట్టుకుంటున్నారు. ఈ సంఖ్యను 100 శాతం చేయడానికి గత కొన్నాళ్లుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జ్యోతి ఫౌండేషన్‌ తరఫున తంజావూర్‌ రౌండ్‌ ఠాణా ప్రాంతంలో శిరస్త్రాణం ధరించి వచ్చిన వాహన డ్రైవర్లకు సంక్రాంతికి రానున్న శివకార్తికేయన్‌ కొత్త సినిమా ‘పరాశక్తి’ టికెట్లను ఉచితంగా అందజేశారు. ఒక్కొక్కరికి మూడు చొప్పున 50 మందికి మొత్తం 150 టికెట్లు ఇచ్చారు. ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇక సినిమా విషయానికొస్తే.. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్, శ్రీలీల, అధర్వ మురళి, రవి మోహన్‌ ముఖ్య పాత్రధారులుగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళనాట 1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ రావడానికి ముందే బోర్డు సూచనల మేరకు 25 చోట్ల కొన్ని పదాలను మార్చారు. ఆ మేరకు ‘తీ పరవట్టుం’ని ‘నీతి పరవట్టుం’, ‘హిందీ అరక్కి’ని ‘అరక్కి’గా మార్చారు.

అలాగే సినిమాలో దిష్టిబొమ్మ దహనం చేసే సన్నివేశం, తపాలా కార్యాలయంపై పేడ కొట్టే సీన్‌, మృతదేహాలను చూపించే సన్నివేశాలను తొలగించారు. కొన్ని హిందీ వ్యతిరేక సంభాషణల సబ్‌ టైటిళ్లనూ తొలగించమని చెప్పారు. అలా సెన్సార్‌ బోర్డు కట్స్‌ తర్వాత 162.43 నిమిషాలతో సినిమా ఈ రోజు విడుదలైంది.

రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus