సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైనట్లు ఇప్పటికే చాలా మంది నటీమణులు మీడియా ముందుకొచ్చి చెప్పారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మీటూ ఉద్యమంలో భాగంగా చాలా మంది దర్శకనిర్మాతలు, హీరోలు నటీమణులను వేధింపులకు గురిచేసినట్లు బయటపడింది. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టెయిన్ పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. తాజాగా అమెరికాకు చెందిన మీడియా పర్సన్, బిజినెస్ విమెన్, మోడల్ పారిస్ హిల్టన్ కూడా అతడిపై విమర్శలు చేసింది.
చాలా ఏళ్ల క్రితం హార్వేతో జరిగిన ఓ సంఘటన గురించి పారిస్ హిల్టన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు హార్వేను కలిశానని.. ఆ సమయంలో తన ఫ్రెండ్ తో కలిసి లంచ్ చేస్తున్నానని అన్నారు. ఆ సమయంలో హార్వే తమ టేబుల్ దగ్గరకి వచ్చి.. ‘మీరు నటి కావాలనుకుంటున్నారా..?’ అని అడిగారని గుర్తు చేసుకుంది. అవునని చెప్పడంతో.. అతడు తన గదికి వచ్చి సినిమా స్క్రిప్ట్స్ చదవమని చెప్పాడని..
కానీ ఆయన అలా అడగడం నచ్చకపోవడంతో అతడి దగ్గరకి వెళ్లలేదని తెలిపింది. అతడి రూమ్ కి వెళ్లకపోవడంతో మరుసటి రోజు రాత్రి తనతో దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చింది. హిల్టన్ బాత్రూమ్ కి వెళ్లిందని గమనించిన హార్వే ఆమెని ఫాలో అయ్యాడట. చాలాసేపు హిల్టన్ ఉన్న బాత్రూమ్ డోర్ కొట్టాడట. తను తెరవకపోవడంతో బలవంతంగా తెరిచే ప్రయత్నం చేసినట్లు హిల్టన్ గుర్తు చేసుకుంది. ఆ సమయంలో చాలా భయపడ్డానని..
సెక్యూరిటీ వచ్చి హార్వేను అక్కడ నుంచి లాక్కెళ్లిపోయారని తెలిపింది. హిల్టన్ చేసిన ఈ ఆరోపణలపై హార్వే ప్రతినిధి స్పందించారు. హాలీవుడ్ లో పాపులారిటీ ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు రావడం కామన్ అయిపోయిందని.. హిల్టన్ తో హార్వే మర్యాదగానే ప్రవర్తించారని.. కానీ ఆమె ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందో తెలియడం లేదని అన్నారు.