“తన కోపమే తనకు శత్రువు” అన్నట్లుగా.. పవన్ కళ్యాణ్ లోని రచయితే అతని పాలిట శత్రువు అవుతున్నాడు. తొలి చిత్రం “అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి” మినహాయిస్తే, “గోకులంలో సేత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి” చిత్రాలతో.. ఒక్కో చిత్రంతో వందేసి మెట్లు ఎక్కుతూ.. అన్నను మించిన తమ్ముడనిపించుకుంటున్న టైం లో ఏరి కోరి “జాని” చిత్రానికి తనే కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుకోవడంతో పాటు, దర్శకత్వం కూడా వహించి చారిత్రిక తప్పిదం చేశాడు పవన్ కళ్యాణ్.
ఆ తప్పిదం నుంచి నేర్చుకోకుండా “సర్దార్ గబ్బర్ సింగ్” కోసం మళ్ళీ పెన్ను పట్టడం అభిమానులకు శాపంగా మారింది. “ఖుషి” తర్వాత రెండేళ్ళు విరామం తీసుకున్నట్లుగానే.. “అత్తారింటికి దారేది” అనంతరం సుమారు మూడేళ్ళు గ్యాప్ తీసుకొని.. తనే స్టొరీ, స్క్రీన్ ప్లే తయారు చేసుకొని తీయించిన సినిమా “సర్దార్ గబ్బర్ సింగ్”.
పవన్ సత్తాను చాటిచెబుతూ “బాహుబలి” రికార్డుల్ని కూడా తోలి రోజు బద్దలు చేసిన ఈ సినిమా రెండో రోజుకే చాలా చోట్ల నీరసపడిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో.. హిమాలయమంత స్టార్ డం కలిగిన తమ అభిమాన కథానాయకుడు తనలో లేని రచయితను ఉన్నాడని భ్రమ పడుతూ తమకు తీవ్ర ఆశాభంగం కలిగిస్తున్నాడని అభిమానులు వాపోతున్నారు!!