నిన్నటి తరం ప్రముఖ నటి పాకీజా (Pakija) అలియాస్ వాసుకి అనారోగ్యం పాలయ్యారు. ఈ మేరకు ఆమె గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తనకు డబ్బు సాయం చాలా అవసరమని ఆ వీడియోల సారాంశం. ఈ నేపథ్యంలో ప్రముఖ కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించి రూ.2లక్షలు తక్షణ ఆర్థిక సాయం చేశారు.
శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి.హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ కలసి వాసుకికీ ఆ మొత్తం అందజేశారు. దీంతో పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) కృతజ్ఞత చెబుతూ వాసుకి భావోద్వేగానికి గురయ్యారు. తమిళనాడులో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నా స్థితి గురించి చెప్పగానే రూ.2లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఆయనది గొప్ప మనసు అని భావోద్వేగానికి గురయ్యారు వాసుకి.
చిరంజీవి (Chiranjeevi) అన్నయ్య, నాగబాబు (Naga Babu) అన్నయ్య, మెగా కుటుంబం చాలాసార్లు నన్ను ఆదుకుంది. వదినమ్మ సురేఖ ఇచ్చిన చీరలు కట్టుకుని బతుకుతున్నా. ఇప్పుడు ఆర్థికసాయం చేసి, ‘మేమున్నాం’ అని మరోసారి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది అని వాసుకి చెప్పుకొచ్చారు. ఇటీవల వాసుకి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పూట గడవక దీనస్థితిలో ఉన్నానని తెలిపారు. మూడేళ్లుగా షూటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్నానని, ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో నా సొంత ఊరు కారైకుడికి వచ్చేశా అని కూడా చెప్పారు.
ఏదైనా సాయం చేస్తారేమోనని ఆంధ్రప్రదేశ్ సీఎంను కలవడానికి నేను రెండుసార్లు విజయవాడ వచ్చానని కానీ, కలవడం కష్టమైందని చెప్పారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంను కలవాలని ప్రయత్నించినా కలవలేకపోయా అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ ఆమెను పిలిపించి సాయం చేయడం గమనార్హం.