పవన్ కళ్యాణ్ సినిమా అనే పేరు చాలు కనీసం కంటెంట్ చూడకుండా కొనేస్తారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా డిజాస్టర్ అయినా తమ డబ్బులు తమకు వచ్చేస్తాయి అని వెర్రి నమ్మకమది. “సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు” సినిమాలకు లాస్ వచ్చినా అది మినిమమ్ కావడంతో లైట్ తీసుకొన్నారు. కానీ.. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ కావడంతో.. ఏమాత్రం ఆలోచించకుండా “అజ్ణాతవాసి” డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను భారీ ధరలకు కొనుగోలు చేశారు డిస్ట్రిబ్యూటర్లు. అయితే.. నిన్న రిలీజైన సినిమా రిజల్ట్ తిప్పికొట్టడం, పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ సినిమాని స్వాగతించకపోవడంతో.. మొదటి రెండు రోజులు ప్రీబుకింగ్స్ పుణ్యమా అని కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ.. ఫస్ట్ వీక్ మాత్రం కష్టమే అంటున్నారు. ముఖ్యంగా ఒక్కటంటే ఒక్క ప్రముఖ వెబ్ సైట్ కూడా సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇవ్వకపోవడంతో మల్టీప్లెక్స్ ఆడియన్స్, ఓవర్సీస్ ఆడియన్స్ సినిమా దరిదాపులకు వెళ్ళడం లేదు.
ముఖ్యంగా.. తెలంగాణలో ఈ సినిమా జోష్ అంతగా కనిపించడం లేదు. ప్రత్యేకించి ప్రీమియర్ షోలకు ప్రభుత్వం నుంచి పరిమితులు రాకపోవడం, అలాగే అదనపు షోలకూ ఛాన్సులు లేకపోవడం, టికెట్ ధరను పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడం.. వంటి రీజన్లు అజ్ఞాతవాసి వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నైజాంలో ఈ సినిమా ఫస్ట్ డేకి ఐదున్నర కోట్ల రూపాయల మొత్తాన్ని రాబట్టిందని.. ఇంకా రాబట్టుకోవాల్సింది చాలా ఉందని.. మరోవైపు పోటీలోకి వస్తున్న ఇతర సినిమాలతో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు టెన్షన్ మొదలవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ట్రేడ్ పండితుల నుంచి.