గత రెండ్రోజులుగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ భీభత్సంగా ఎగ్జైట్ అవుతున్నారు. అలాగే.. నిన్న పవన్ కళ్యాణ్ తోపాటు ఒక్క చిరంజీవి మినహా మెగా హీరోలు, మెగా ఫ్యామిలీ సపోర్టర్స్ అందరూ ఫీలిం ఛాంబర్ చేరుకోవడంతో “ఏదో పెద్ద రచ్చ జరిగేలా ఉందని” ఊహించినవారందరి ఆశలు కొద్ది గంటల్లోనే తారుమారయ్యాయి. అయితే.. పోలీసుల అభ్యర్ధన మేరకు ఫిలిమ్ ఛాంబర్ నుంచి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సాక్షిగా రచ్చ మాత్రం ఆపలేదు. నిన్నట్నుంచి డైరెక్ట్ గానే తన ప్రత్యర్ధుల మీద దాడి మొదలెట్టాడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఉదయం హైద్రాబాద్ లో చిత్రపరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్స్ లోని ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆల్రెడీ నిన్న ఆయన లాయర్లతో సమావేశం ఏర్పాటు చేసి తన ఇమేజ్ కు తన కుటుంబం ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా కథనాలు ప్రసారం చేసి, తమ టీయార్పీ రేటింగ్స్ కోసం ఏర్పాటు చేసిన డిబేట్స్ ను ఉద్దేశించి లీగల్ గా పరువు నష్టం దావాలు వేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ సన్నద్ధమవుతున్న విషయం నిన్నటికే అందరికీ క్లారిటీ వచ్చింది.
అయితే.. ఇవన్నీ కాకుండా టీవి5, టీవి9, ఏబీఎన్ న్యూస్ చానల్స్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేయడం వల్ల రాజకీయపరంగా పవన్ కు పెద్ద మైనస్ అని తెలిసినా తన వద్ద కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ చెబుతుండడంతో ప్రస్తుతానికైతే సదరు చానల్ ఓనర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే.. ఏమిటా సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలతో పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు? అసలు ఇవాళ ఉదయం ట్వీట్ చేసినట్లుగా “బట్టలిప్పి మాట్లాడుకుందాం రండి” అంటే పవన్ కళ్యాణ్ అంతరార్ధం ఏమిటి? అసలు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో అన్న ఆసక్తి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాత్రమే కాక ప్రతి సగటు పౌరుడిలోనూ ఉంది.
అయితే.. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ ఇదంతా కావాలనే చేస్తున్నాడని, చంద్రబాబు దీక్షపై ప్రజలు ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేయకుండా ఉండడం కోసమే పవన్ ఇదంతా చేస్తున్నాడని, దీని వెనుక బిజెపి ప్రభుత్వ హస్తం ఉందనే వాదనలు కూడా వినబడుతున్నాయి. ఈ రచ్చకీ ఒక క్లారిటీ కావాలంటే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో కాకుండా డైరెక్ట్ గా ఆధారాలతో సహా నోరు విప్పాల్సిందే.