భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు.. డైరెక్టర్లు, నిర్మాతలు చివరి నిమిషం దాకా స్టూడియోల్లోనే కుస్తీ పడుతుంటారు. ఫైనల్ కట్, మిక్సింగ్ అంటూ రిలీజ్ కి ముందు రోజు రాత్రి వరకు చెక్ చేసుకుంటూనే ఉంటారు.
కాపీలు వెళ్లే వరకు స్టూడియోల్లోనే ఉంటారు. అవసరం అనుకుంటే అక్కడే పడుకుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఓవర్సీస్ ప్రీమియర్స్ క్యాన్సిల్ అవ్వడం, రిలీజ్ రోజున షోలు డిలే వంటి సమస్యలు వచ్చి పడతాయి.
ఈ ఏడాది వచ్చిన ‘రాజాసాబ్’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి పెద్ద సినిమాల విషయంలో దర్శకులు, నిర్మాతలు పడ్డ టెన్షన్స్ అందరికీ తెలిసిందే. మరికొద్దిరోజుల్లో మన ముందుకు రాబోతున్న పెద్ద సినిమా ‘పెద్ది'(Peddi). ఆ సినిమా విషయంలో కూడా ఇలాంటి సమస్యలు సంభవిస్తే పరిస్థితి ఏంటి? అనే చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి.అయితే ‘పెద్ది’ టీమ్ మాత్రం మాకు అలాంటి టెన్షన్స్ ఏమీ లేవు అంటూ ధీమాగా కూర్చున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మరో వారం రోజుల్లో అంటే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇంత టైమ్ ఉండగానే.. డైరెక్టర్ బుచ్చిబాబు సాన అండ్ టీమ్ పనులన్నీ పూర్తి చేసి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారట. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఫైనల్ ఎడిట్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా పూర్తిగా లాక్ అయిపోయిందని తెలుస్తోంది. దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిజిటల్ ప్రొవైడర్లకు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఫైనల్ కట్ ప్రింట్స్ ఆన్ టైమ్‌లో డిస్పాచ్ చేశారట.
ఒక భారీ బడ్జెట్ సినిమాకు లాస్ట్ మినిట్ హడావుడి లేకుండా, ఇంత ప్లానింగ్‌తో కంటెంట్ డెలివరీ అవ్వడమంటే ఈరోజుల్లో గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఇక థియేటర్ల దగ్గర నడుస్తున్న పర్సంటేజ్ సిస్టమ్ ఇష్యూ కూడా ఈ వీకెండ్ కి సాల్వ్ అయిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.