సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిన చిత్రాల్లో ‘బ్రహ్మోత్సవం’ ఒకటి. కుటుంబ కథా నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా అపజయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను నిర్మాత పివిపి తాజాగా వెల్లడించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పీవీపీ, సినిమా ప్రారంభ దశ నుంచే స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు అవసరమని తాను చెప్పానని తెలిపారు. పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం కాకుండా షూటింగ్ మొదలుపెట్టడం మంచిది కాదని ముందుగానే హెచ్చరించానని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పెట్టుబడులు కూడా ఇందులో ఉంటాయని, అందుకే మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించినట్లు తెలిపారు.
అయితే కథ పరంగా “బ్రహ్మోత్సవం”లో మంచి భావోద్వేగాలు ఉన్నాయని, కానీ నిర్మాణ దశలో సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల సినిమా ప్రభావం తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా షూటింగ్ సమయంలో క్రమశిక్షణ, పక్కా ప్రణాళిక లేకపోవడం ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సమస్యగా మారుతోందని కూడా వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి నిర్లక్ష్య ధోరణి అని పీవీపీ పేర్కొన్నారు. స్క్రిప్ట్ పూర్తి కాకుండానే సెట్స్ పైకి వెళ్లడం, షూటింగ్ సమయంలో మార్పులు చేయడం వల్ల బడ్జెట్ పెరగడమే కాకుండా ఫైనల్ అవుట్‌పుట్‌పై కూడా ప్రభావం పడుతుందని అన్నారు.
ఇప్పుడు పీవీపీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “బ్రహ్మోత్సవం” గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడటం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. మరోవైపు మహేష్ అభిమానులు మాత్రం ఆ సినిమా కథలో మంచి భావోద్వేగం ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్‌లో లోపాల వల్లే ఫలితం దెబ్బతిందని కామెంట్లు చేస్తున్నారు.