మనిషి జీవితంలో డబ్బు సంపాదన అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే.. ఆ సంపాదన మార్గం ఏమిటనేది మాత్రం ఆలోచించి ఎంచుకోవాల్సిన విషయం. కొందరు డబ్బు సంపాదన కోసం నీతి నిజాయితీలను నమ్ముకొంటే.. కొందరు మాత్రం సదరు నీతి అనేది చెత్తబుట్టలో పడేసి అత్యంత హేయమైన పద్ధతులను ఎంచుకొని డబ్బు సంపాదిస్తుంటారు. ఆ రెండో కేటగిరీకి చెందినోళ్లే ప్రస్తుతం యూట్యూబ్ లో “శ్రీదేవి మరణ వార్త”ను రకరకాల కోణాల్లో వ్రాస్తూ ట్రెండింగ్ లో ఉన్న చానల్ ఒనర్లు.
కనీస స్థాయి కామన్ సెన్స్, సిగ్గు, లజ్జ అనేవి వదిలేసి “శ్రీదేవి అలా చనిపోయింది, శ్రీదేవి బాత్ రూమ్ లో ఏం చేసింది, ఆఖరి 15 నిమిషాలు శ్రీదేవి పడిన బాధను ఇక్కడ చూడండి” అంటూ చిత్రవిచిత్రమైన హెడ్డింగులు పెట్టి సరైన అవగాహన లేని జనాలను ముఖ్యంగా జియో యూజర్లను టార్గెట్ చేసి ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నారు. కొందరు ఆ ట్రెండింగ్ వీడియోలను చూసి నిజనిజాలను పక్కనెట్టి ఆ సోది కబుర్లనే నిజమని నమ్మేస్తున్నారు. ఈ వీడియో చూస్తే యూట్యూబ్ నుంచి వచ్చే డాలర్ల కోసం మరీ ఇంతలా దిగజారాలా అనేది ఎవరికీ అర్ధం కాని విషయం. హీరోయిన్లు బట్టలు జార్చిన వీడియోలు, సినిమాలో హాట్ వీడియోస్ తో ఆల్రెడీ యూట్యూబ్ ని పోర్న్ సైట్ చేసిపాడేశారు. మళ్ళీ ఈ తరహా వీడియోలతో ఆ దారిద్రాన్ని ఇంకాస్త దరిద్రంగా మార్చకండి. ఎందుకంటే.. భవిష్యత్ తరాలు ఈ వీడియోలు చూసి తప్పుడు సమాచారం నేర్చుకొనే అవకాశం పుష్కలంగా ఉన్నాయి.