పేట

  • January 10, 2019 / 07:48 AM IST

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఆఫ్ ప్రెజంట్ జనరేషన్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన చిత్రం “పెట్ట”. ఈ చిత్రాన్ని తెలుగులో “పేట”గా అనువదించి విడుదల చేశారు. సినిమా టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్ కి వింటేజ్ రజనీకాంత్ ను గుర్తుచేయగా.. పాటలు పిచ్చెక్కించాయి. మునుపెన్నడూలేని విధంగా ఈ సినిమా కోసం రజనీ అభిమానులు ఆశగా ఎదురుచూశారు. మరి కార్తీక్ సుబ్బరాజ్ వారి అంచనాలను అందుకోగలిగాడా లేదా? అనేది చూద్దాం..!!

కథ: ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో హాస్టల్ వార్డెన్ గా జాయినవ్వడానికి ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రికమెండ్ చేయించి మరీ సింపుల్ ఎంట్రీ ఇస్తాడు కాళీ (రజనీకాంత్). రాగానే అక్కడి టెర్రర్ గ్యాంగ్ (బాబీ సింహా)కు తన పవర్ చూపించి అక్కడ హాస్టర్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ కు అండగా నిలుస్తాడు.

అదే హాస్టల్ లో చదువుకొంటున్న అన్వర్ అనే కుర్రాడు అను (మేఘా ఆకాష్)తో తన ప్రేమ వ్యవహారంలో వచ్చిన సమస్యలు తీర్చమని కాళీని కోరతాడు. అందుకోసం అను తల్లి మంగళ (సిమ్రాన్)ను కలుస్తాడు కాళీ. అన్వర్-అనులను కలపడానికి వెళ్ళిన కాళీ మంగళను ఇష్టపడమ్ మొదలెడతాడు. ఈ లవ్ స్క్వేర్ ఏదో బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన జిత్తు (విజయ్ సేతుపతి), సింహాచలం (నవాజుద్దీన్ సిద్ధిఖీ) కాళీ జీవితంలోకి ప్రవేశిస్తారు.

ఇంతకీ కాళీ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ను సిఫారసు పొందే స్థాయి అతనికి ఎలా వచ్చింది? జిత్తు, సింహాచలంలతో అతడికున్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన టిపికల్ సమాధానాల సమాహారమే “పేట” చిత్రం.

నటీనటుల పనితీరు: “కబాలి, కాలా” సినిమాలు కథాపరంగా బాగున్నప్పటికీ.. రజనీ ఫ్యాన్స్ నిరాశచెందడానికి కారణం ఏంటో ప్రతి రజనీ అభిమానికీ తెలిసిందే. వాళ్ళు మిస్సైన రజనీ మ్యానియా ఈ సినిమాలో పూర్తిస్థాయిలో కనిపించింది. తన అభిమానులు ఏం కోరుకొంటున్నారు అనేది అర్ధం చేసుకొన్న రజనీ ఈ సినిమాలో మునుపటికంటే స్టైలిష్ గా, స్మార్ట్ గా కనిపించడమే కాక సరికొత్త మ్యానరిజమ్స్ తో ప్రేక్షకుల్ని అలరించాడు. ఆయన డ్రెస్సింగ్, డైలాగ్ డెలివరీ, స్టైల్, డ్యాన్స్ & యాటిట్యూడ్ వంటివన్నీ పతాకస్థాయిలో ఉన్నాయి.

చాన్నాళ్ల తర్వాత సిమ్రాన్ కి మంచి పాత్ర దొరికింది. తనదైన స్క్రీన్ ప్రెజన్స్ మరియు గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది సిమ్రాన్. త్రిష్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. కనిపించినంతలో ఆకట్టుకుంది. కాకపోతే.. ఈ ఇద్దరి పాత్రలు గెస్ట్ రోల్స్ లా మిగిలిపోయాయి.

విజయ్ సేతుపతి తనదైన స్క్రీన్ ప్రెజన్స్ & పెర్ఫార్మెన్స్ తో రజనీకి మంచి పోటీ ఇచ్చాడు. నవాజుద్దీన్ సింహాచలం పాత్రలో ఒదగడానికి కాస్త టైమ్ తీసుకొన్నాడు. కాకపోతే.. సరైన జస్టీఫికేషన్ లేకపోవడంతో ఆయన క్యారెక్టర్ సోసోగా మిగిలిపోయింది. ఇక శశికుమార్, బాబీ సింహా వంటి ఆర్టిస్టులు లెక్కకుమిక్కిలి ఉన్నప్పటికీ.. వాళ్ళ పాత్రలకు పెద్ద ప్రాముఖ్యత లేదు.

సాంకేతికవర్గం పనితీరు: అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టు లాంటిది. పాటలతోనే పిచ్చెక్కించిన అనిరుధ్.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో అభిమానుల చేత డ్యాన్స్ చేయించాడు. అనిరుధ్ కెరీర్ లో బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అందించాడు. ఆ ఎలివేషన్ సీన్స్ కి బీజీయమ్ ఏదైతే ఉందో.. రజనీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించందంటే నమ్మండి.

తిరు సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. మనం ఇన్నాళ్లుగా చూస్తున్న రజనీకాంత్ ను కొత్తగా చూపించడమే కాక ఫ్యాన్స్ ను విశేషమైన రీతిలో ఆకట్టుకున్నాడు తిరు. ముఖ్యంగా ఫైట్స్ సీక్వెన్స్ లకు ఆయన పెట్టిన ఫ్రేమింగ్స్ ప్రతి రజనీ ఫ్యాన్ చేత విజిల్ వేయించేలా ఉంది. ఎక్కువ స్లోమోషన్ షాట్స్ ను యూజ్ చేయకుండా.. కొత్త ఫ్రేమింగ్స్ తో అలరించాడు తిరు. ఆర్ట్ వర్క్, కలరింగ్, డి.ఐ వంటివి సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి.

ఒక కరడుగట్టిన రజనీ అభిమానిగా కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అమోఘం. ఫస్టాఫ్ మొత్తం రజనీ అభిమానుల కోసమే అన్నట్లుగా ఉంటుంది. ప్రతి సీన్ కి విజిల్స్ పడడం గ్యారెంటీ. కాకపోతే.. సెకండాఫ్ కి వచ్చేసరికి ప్రేక్షకులను కాస్త థ్రిల్ చేద్దామని కార్తీక్ సుబ్బరాజ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సెకండాఫ్ లో ల్యాగ్ చాలా ఎక్కువైంది. అలాగే క్లైమాక్స్ ను కూడా ఏదో డిఫరెంట్ గా ఎండ్ చేద్దామని ప్రయత్నించి బోర్ కొట్టించాడు. ఓవరాల్ గా రజనీ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా “పేట”. కాకపోతే.. రెగ్యులర్ ఆడియన్స్ ను మాత్రం ఆకట్టుకోవడం కష్టమే.

విశ్లేషణ: కొన్నాళ్లుగా వింటేజ్ రజనీకాంత్ ను మిస్ అవుతున్న రజనీ అభిమానులు తప్పకుండా చూసి ఆనందించాల్సిన సినిమా “పేట”. సెకండాఫ్ ను కాస్త తట్టుకోగలిగితే జనరల్ ఆడియన్స్ కు కూడా నచ్చే అవకాశాలున్నాయి కానీ.. అంత సహనం పాటించడం కాస్త కష్టమే.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus