‘పిండం’ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుంది: నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలలో వేగం పెంచింది. శనివారం నాడు నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి విలేఖర్లతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

పిండం ప్రయాణం ఎలా మొదలైంది?
నా పేరు యశ్వంత్. నాకు యూఎస్ లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఎప్పటినుంచో సినిమా చేయాలని ఉంది. ఓ మంచి కథతో సినిమా చేద్దామని ఇండియాకి వచ్చాము. మొదట వేరే కథ చేద్దామనుకున్నాం. అయితే దర్శకుడికి అనుకోకుండా ఈ కథ ఆలోచన వచ్చింది. వారం రోజుల్లోనే కథ పూర్తి చేసి, పిండం అనే టైటిల్ చెప్పారు. మీ అందరి లాగానే మేము కూడా మొదట టైటిల్ విని ఆశ్చర్యపోయాము. అయితే ఒక జీవి జన్మించాలంటే పిండం నుంచే రావాలి. మరణం తర్వాత పిండమే పెడతారు. జననంలోనూ, మరణంలోనూ ఉంటుంది కాబట్టి పిండం టైటిల్ పెట్టడంలో తప్పేముంది? సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకి కూడా మనం ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమవుతుందని దర్శకుడు చెప్పారు. కథ ఓకే అనుకున్నాక పనులన్నీ చకచకా జరిగిపోయాయి. జూన్ లో షూటింగ్ ప్రారంభమైంది. సెప్టెంబర్ కి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాము.

దర్శకుడితో పరిచయం ఎలా జరిగింది?
దర్శకుడు నాకు మంచి స్నేహితుడు. వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. అతను మంచి బిజినెస్ మేన్, అలాగే మంచి దర్శకుడు కూడా. 2014-15 సమయంలో నాకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచే కథలు రాసుకునేవాడు. ఎప్పటికైనా దర్శకుడు అవ్వాలని చెప్పేవాడు. ఏళ్ళు గడుస్తున్నా అదే పట్టుదలతో ఉన్నాడు. మొదట సిద్ధు జొన్నలగడ్డతో ఓ క్రైమ్ కామెడీ సినిమాని డల్లాస్ లో చేయాలని సన్నాహాలు చేశాము. కానీ అదే సమయంలో కోవిడ్ రావడంతో వాయిదా పడింది. ఆ తర్వాత అందరూ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యారు. అప్పుడు వేరే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, అతికొద్ది సమయంలోనే దర్శకుడు ఈ పిండం కథని రాశాడు. ఇది చాలా అద్భుతమైన కథ. ఇది ప్రస్తుతం, 1990 లలో, 1930 లలో ఇలా మూడు కాలాలలో జరిగే కథ. ఇది మా మొదటి సినిమా అయినప్పటికీ ఇండియాలోనూ, ఓవర్సీస్ లోనూ భారీగానే విడుదల చేస్తున్నాం.

ఈ ప్రాజెక్ట్ లోకి శ్రీరామ్ ఎలా వచ్చారు?
మా కాస్టింగ్ డైరెక్టర్ కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. దర్శకుడికి శ్రీరామ్ గారి పేరు వినగానే ఆయనే కరెక్ట్ అనిపించింది. దర్శకుడికి ఒక విజన్ ఉంటుంది కదా, ఆ పాత్రకి శ్రీరామ్ గారు సరిగ్గా సరిపోతారని ఎంపిక చేశారు. శ్రీరామ్ గారు కూడా తెలుగులో కథానాయకుడిగా చేసి చాలా కాలమైంది. మా దర్శకుడు హాలీవుడ్ నటీనటులతో స్మోక్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. అది చూసి, ఒక 10-15 నిమిషాల కథ విని శ్రీరామ్ గారు వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు.

సినిమా ఎలా ఉండబోతుంది?
మిగతా హారర్ చిత్రాలతో పోలిస్తే, ఇది భిన్నంగా ఉంటుంది. ఈ తరహాలో సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి పిండం టైటిలే సరైనది. దాని చుట్టూనే కథ తిరుగుతుంది. సహజంగా ఉంటుంది చిత్రం. ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మేము కేవలం ఒక్క సినిమా తీయడానికి పరిశ్రమకు రాలేదు. దీని తర్వాత వరుసగా మరిన్ని విభిన్న చిత్రాలు చేస్తాం.

కొత్త నిర్మాతగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
100 కోట్లు కాదు 1000 కోట్లు ఉన్నా సినిమా చేయడం అంత తేలిక కాదు. వందల మందితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిసి రావాలి. అప్పుడే వాటంతట అవి పనులు జరుగుతుంటాయి. లేదంటే ఎన్ని కోట్ల డబ్బులున్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే షూటింగ్ సమయంలో సినీ కార్మికులను చూసి బాధ కలిగింది. తెల్లవారుజామున వచ్చి రాత్రి వరకు గొడ్డు చాకిరి చేస్తే వారికి తక్కువ డబ్బులే వస్తాయి. అయినప్పటికీ సినిమా మీద ఇష్టంతో వారి పని చేస్తుంటారు. నేను వారి జీవితాలను మార్చలేకపోవచ్చు, కానీ నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరినీ నా వాళ్ళగానే భావిస్తాను.

సినిమా అనుకున్న బడ్జెట్ లోనే అయిందా? బిజినెస్ బాగా జరిగిందా?
మేము అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలోనే సినిమాని పూర్తి చేయగలిగాము. బిజినెస్ పట్ల సంతృప్తిగా ఉన్నాము. ట్రైలర్ చూసిన తర్వాత పలువురు డిస్ట్రిబ్యూటర్లు వాళ్లంతట వాళ్ళే మమ్మల్ని సంప్రదించారు. మంచి ధరకే సినిమా పంపిణీ హక్కులను అమ్మడం జరిగింది. ఓటీటీ కి కూడా మంచి ఆఫర్లు వచ్చాయి.

షూటింగ్ సమయంలో ఏవో అనుకోని ఘటనలు జరిగాయట?
ఒకరు ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఒకరికి కాలు విరిగింది. ఒకసారి సెట్ లోకి పాము వచ్చింది. ఇంకోసారి ఈశ్వరి గారి తలకి గాయమైంది. అలాగే ఒకసారి ఆదివారం అమావాస్య అని తెలియకుండా అర్ధరాత్రి షూటింగ్ ప్లాన్ చేశాం. చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ వచ్చి అమావాస్య అర్ధరాత్రి అని భయపడుతుంటే, దగ్గరలోని గుడి నుంచి కుంకుమ తెప్పించి అందరికీ బొట్లు పెట్టించాము.

సినిమా అవుట్ పుట్ చూసుకున్నాక ఏమనిపించింది?
సినిమా మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. దర్శకుడు మాకు చెప్పిన దానికంటే తక్కువ రోజుల్లోనే పూర్తి చేసి, మంచి అవుట్ పుట్ ఇచ్చారు.

నటీనటుల గురించి?
సినిమాలో ఉన్నది తక్కువ పాత్రలే అయినప్పటికీ అందరూ అద్భుతంగా నటించారు. అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లే. ముఖ్యంగా ఇద్దరు చిన్న పిల్లలు అద్భుతంగా నటించారు. అవసరాల శ్రీనివాస్ గారు కూడా ఒక ముఖ్య పాత్ర చేశారు. మా దర్శకుడు చేసిన స్మోక్ షార్ట్ ఫిల్మ్ చూసి, ఆయన వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారు.

సాంకేతికంగా సినిమా ఎలా ఉండబోతుంది?
హారర్ సినిమాలకు సంగీతం కీలకం. నేపథ్యం సంగీతం అద్భుతంగా ఉంటుంది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus