ఏ ముహూర్తాన ‘ఇండియన్2’ షూటింగ్ మొదలు పెట్టారో కానీ.. మొదటి నుండీ ఏదో ఒక రూపంలో ఈ చిత్రం షూటింగ్ కు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ళు బడ్జెట్ సమస్యలని.. కొన్నాళ్ళు.. కమల్ రాజకీయ వ్యవహారం అని.. ఇంకో సారి అయితే నిర్మాతలతో.. ఆర్ధికలావాదేవీల విషయంలో దర్శకుడు శంకర్ గొడవ పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ తరుణంలో హీరో కమల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి చక్కదిద్ది.. షూటింగ్ ప్రారంభమయ్యేలా చేశారు. ఇదిలా ఉండగా… ఇటీవల ‘ఇండియన్ 2’ సెట్స్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు కూడా వార్తలు వచ్చాయి. దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇక చనిపోయిన పోయిన వారి కుటుంబాలకు దర్శకుడు శంకర్ మరియు నిర్మాతలు ఆర్ధిక సాయాన్ని కూడా అందిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సంఘటన పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎవ్వరినీ విడిచి పెట్టకుండా విచారిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు శంకర్ మరియు హీరో కమల్ ను విచారించారు. వారు అడిగిన ప్రతీ ప్రశ్నకు కమల్, శంకర్ లు సమాధానాలు చెప్పారట. ఇక ప్రమాదం చోటుచేసుకున్న స్థలంలో హీరోయిన్ కాజల్ కూడా ఉండడంతో ఆమెకు కూడా సమన్లు పంపారట పోలీసులు. త్వరలో ఆమెను కూడా విచారించబోతున్నట్టు తెలుస్తుంది.