పోన్ మగళ్ వందాళ్ మూవీ రివ్యూ & రేటింగ్ (తమిళ్)

తమిళంలో థియేటర్స్ విడుదల లేకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన మొదటి చిత్రం పోన్ మగళ్ వందాళ్. జ్యోతిక ప్రధాన పాత్రలో హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేయడానికి సూర్య థియేటర్స్ యాజమాన్య సంఘాల సభ్యులతో పెద్ద యుద్ధమే చేశాడు. వారు ఎన్ని బెదిరించినా సూర్య తన పంతం నెగ్గించుకుని ఈ చిత్రాన్ని అమెజాన్ లో విడుదల చేశాడు. ఇన్ని ప్రాయాసల మధ్య అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ సమీక్షలో చూడం

కథ: ఊటీ వేదికగా 2004లో ఐదుగురు బాలికలు వరుస హత్యలకు గురవుతారు. ఈ బాలికల హత్యకు కారణం సైకో అయిన జ్యోతి అని తెలుసుకున్న పోలీసులు ఆమెను ఎన్కౌంటర్ లో చంపివేస్తారు. 15ఏళ్ల తరువాత లేడీ లాయర్ వెన్బా(జ్యోతిక) ఐదుగురు బాలికల హత్య కేసును రీఓపెన్ చేయిస్తుంది. అలాగే వారి హత్యలకు సైకో జ్యోతి కారణం కాదని కోర్టులో న్యాయం కోసం పోరాటం మొదలుపెడుతుంది. అసలు ఈ వెన్బా ఎవరు? ఈ కేసుకు ఆమెకున్న సంభందం ఏమిటీ? నిజంగా ఆ ఐదుగురు బాలికలను హత్య చేసింది జ్యోతినా ఇంకెవరైనా ఉన్నారా? చివరికి వెన్బా పోరాటం ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు: ఒక బలమైన కారణం, లక్ష్యంతో కోర్టులో న్యాయపోరాటం చేసే మహిళా లాయర్ గా జ్యోతిక నటన టాప్ క్లాస్ అనాలి. సాధారణంగా సినిమాలలో లాయర్ వాదనలు గొంతు చించుకొని గట్టిగా అరవడం అనే కోణంలో చూపించే వారు, దానికి భిన్నంగా జ్యోతిక బాడీ లాంగ్వేజ్ మరియు ఎక్స్ ప్రెషన్స్ ఎమోషనల్ గా సాగుతాయి. ఆమె నటన చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది.

కథ రీత్యా చాలా తక్కువ పాత్రలతో సాగే ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో జ్యోతిక ప్రత్యర్థి లాయర్ గా చేసిన సీనియర్ నటుడు పార్తీబన్ ఎప్పటిలాగే తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. ఇక మరో నటుడు భాగ్యరాజ్ ఎమోషనల్ అండ్ సిరీయస్ డ్రామాలో అక్కడక్కడా నవ్వులు పూయించి ప్రేక్షకులకు ఉపశనం పంచారు. సపోర్టింగ్ పాత్రలు చేసిన నటులు తమ పాత్ర పరిధిలో ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు: ఇలాంటి సస్పెన్సు మరియు కోర్ట్ రూమ్ డ్రామాలకు సన్నివేశాలు తెరపై పండాలి అంటే అద్భుతమైన బీజీఎమ్ అవసరం, ఆ విషయంలో సంగీత దర్శకుడు నిరాశ పరిచాడు. నేపథ్యంలో వచ్చే రెండు పాటలు సైతం పరవాలేదు అన్నట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది.

వేగంగా సాగే కథనం, మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తో నడిపించిన ప్రథమార్థంలో అలరించిన దర్శకుడు అదే వేగాన్ని సెకండ్ హాఫ్ లో కొనసాగించలేకపోయాడు.

విశ్లేషణ: సమాజంలో మహిళలు, చిన్నపిల్లలపై జరిగే అకృత్యాలు అనే ఓ సీరియస్ పాయింట్ ని కథావస్తువుగా తీసుకున్న దర్శకుడు ఓ యువ లాయర్ చేసే న్యాయపోరాటం ఎమోషనల్ గా తెరకెక్కించాలని అనుకున్నారు. దర్శకుడు ఓ దశ వరకు ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచి విజయం సాధించాడు. ఐతే ఆయన సెకండ్ హాఫ్ తరువాత కథనంపై పట్టుకోల్పోపోయారు. సెకండ్ హాఫ్ లో నెమ్మదించిన కథనం ప్రేక్షకుడిని నిరాశకు గురి చేస్తుంది. ఆసక్తి రేపే ప్రారంభం, మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తరువాత ప్రేక్షకుడి అంచనా సెకండ్ హాఫ్ పై పెరిగిపోగా అవి చేరుకోలేక పోయారు.

ఓ దశ తరువాత కోర్ట్ రూమ్ సన్నివేశాలు ఆసక్తిని కోల్పోయాయి. కథ నెమ్మదిగా సాగుతున్నప్పటికీ ఆ ఐదుగురు బాలికల హత్యల వెనకున్నది ఎవరు అనే ఆసక్తి మాత్రం చివరి వరకు దర్శకుడు కొనసాగించారు. క్లైమాక్స్ ట్విస్ట్ సైతం మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మరియు కోర్ట్ రూమ్ డ్రామా సన్నివేశాలు ఇంకొంచెం ఆసక్తికరంగా మలిచివుంటే మూవీ మరో స్థాయిలో ఉండేది. ఇక హిందీ పింక్ తో పాటు శ్రీహరి నటించిన శ్రీమహాలక్ష్మీ వంటి అనేక సినిమాలు ఈ పాయింట్ ఆధారంగా తెరకెక్కాయి. కాబట్టి ఓ భిన్నమైన చిత్రం చూస్తున్నాం అన్న భావన ప్రేక్షకుడికి కలగదు.

రేటింగ్: 2/5

Click Here To Read English Review

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus