మాస్టర్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం “పోన్నియన్ సెల్వన్”. కల్కి రచించిన పుస్తకం ఆధారంగా.. అదే పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి భాగం నేడు ప్రపంచవ్యాప్తంగా తమిళ-తెలుగు-హిందీ-కన్నడ-మలయాళ భాషల్లో విడుదలైంది. ఈ మణిరత్నం సినిమా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: చోళ రాజ్యాన్ని సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) విజయవంతంగా పరిపాలిస్తుండగా.. తదుపరి రాజుగా సుందర చోళుడి చిన్నకుమారుడు అరుల్ మోజీ వర్మన్ అలియాస్ పోన్నియన్ సెల్వన్ (జయం రవి) ప్రకటించడానికి మంత్రివర్గం సిద్ధమవుతుంది. అయితే.. పోన్నియన్ సెల్వన్ స్థానంలో మధురంటక (రెహమాన్) రాజవ్వాలనుకుంటాడు. ఈ అంతర్యుద్ధంలో.. నందిని (ఐశ్వర్య రాయ్) కుతంత్రం, కుందవలి (త్రిష) రాజకీయతంత్రం ఎలాంటి పాత్ర పోషించాయి అనేది “పోన్నియన్ సెల్వన్” తొలి భాగం కథాంశం.
నటీనటుల పనితీరు: విక్రమ్, ఐశ్వర్య రాయ్, శరత్ కుమార్, పార్తిబన్, ప్రకాష్ రాజ్, జయరామ్ వంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. వాళ్లందరినీ తన నటన & స్క్రీన్ ప్రెజన్స్ తో డామినేట్ చేశాడు కార్తీ. విక్రమ్, జయం రవిలు రాజులుగా బాడీ లాంగ్వేజ్ పరంగా చక్కగా నటించినా.. ఎక్కడో చిన్న లోటు మాత్రం కనిపిస్తూనే ఉంది.
నందినిగా ఐశ్వర్య అందంగా కనిపిస్తూనే.. కళ్లలోనే కుతంత్రాన్ని, కవ్వింపుని కలగలిపి ఆకట్టుకుంది. త్రిష, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: మాస్టర్ ఫిలిమ్ మేకర్ మణిరత్నం, సహజత్వం కోసం తపించే దర్శకుడు. ఆయన సినిమాల్లో పాత్రలు, వాటి తీరుతెన్నులు కూడా సహజంగానే ఉంటాయి. అయితే.. ప్రస్తుత తరం ప్రేక్షకులకు సహజత్వంతోపాటు కాస్త అతిశయం కూడా కావాలి. ఆ అతిశయం గ్రాఫిక్స్, వి.ఎఫ్.ఎక్స్ మాత్రమే కాదు.. తెరకెక్కించే విధానం. “పోన్నియన్ సెల్వన్” ఆ అతిశయం అనేది ఎక్కడా కనిపించలేదు.
పైగా.. “బాహుబలి” లాంటి సినిమా చూశాక.. హిస్టారిక్ సినిమాలంటే ఇలా ఉండాలి అని రేంజ్ సెట్ చేసుకున్నారు ప్రేక్షకులు. వాళ్ళ అంచనాలను మణిరత్నం అందుకోలేకపోయారనే చెప్పాలి. “పోన్నియన్ సెల్వన్” పుస్తకానికి న్యాయం చేసిన మణిరత్నం.. సినిమాగా మాత్రం ఆకట్టుకొనే స్థాయిలో తెరకెక్కించలేకపోయారు. కనీసం ఆయన మునుపటి చిత్రం “నవాబ్”లో కనబడిన టెక్నికల్ స్టాండర్డ్ కూడా ఈ చిత్రంలో కనిపించకపోవడం గమనార్హం.
రవివర్మన్ నుండి ఆశించే స్థాయి కెమెరా పనితనం ఈ చిత్రంలో కనిపించలేదు. ఐశ్వర్య రాయ్ కనబడే కొన్ని సన్నివేశాలు తప్పితే.. ఎక్కడా ఆయన మార్క్ సినిమాటోగ్రఫీ లేకపోవడం మైనస్ గా మారింది. అలాగే.. ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా సాధారణంగా ఉంది. చోళ రాజుల ప్రాముఖ్యతను కానీ, రాజ్య సంపదను కానీ ఎక్కడా ఎలివేట్ చేయలేకపోయారు. లొకేషన్స్ కూడా అంత రిచ్ గా లేవు. ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం తమకు కుదిరినంతలో బాగానే వర్క్ చేశారు.
విశ్లేషణ: ఒక సగటు ప్రేక్షకుడు ఆశించే హై మూమెంట్స్ ఏమీ లేకపోవడంతో “పోన్నియన్ సెల్వన్” ఒక సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. మణిరత్నం నుంచి ఆశించే స్థాయి సినిమా అయితే కాదు. కానీ.. పుస్తక ప్రేమికులు, యాక్షన్ ఆశించకుండా, డ్రామాను ఆస్వాదించే ప్రేక్షకులు మాత్రం ఓ మోస్తరుగా ఎంజాయ్ చేసే చిత్రమిది.
రేటింగ్: 2/5