టాలీవుడ్‌లో సినిమాలు కథ, స్క్రీన్‌ప్లే మీద ఎంతగా నడుస్తాయో.. కాంబినేషన్ల మీద అంతగా నడుస్తాయి. కాంబినేషన్ సెట్ అయింది అంటే సినిమా సగం విజయం సాధించేసినట్లే అని మురిసిపోతుంటారు తెలుగు సినిమా జనాలు. అందుకే కాంబినేషన్ కోసం దర్శకనిర్మాతలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచించి రెండు సినిమాల్లో నటించి హిట్ కొట్టిన ఓ జోడీ.. ఆ తర్వాత రెండు సినిమాల్లో కలసి నటించే అవకాశం వచ్చినా కుదర్లేదు. మరోవైపు ఆ హీరోయిన్ క్రేజ్ తగ్గిపోయింది. దీంతో హ్యాట్రిక్ అవకాశం ఇకలేదు అనుకున్నారంతా.
అయితే, ఆ కాంబోను ఇప్పుడు సెట్ చేసే పనిలో ఉన్నారు లోకేశ్ కనగరాజ్. ఇప్పటికే అర్థమై ఉంటుంది. లేదంటే దర్శకుడు పేరు చెప్పినప్పుడైనా అర్థమై ఉంటుంది. ఆ జోడీ అల్లు అర్జున్ – పూజా హెగ్డే అని. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు ‘దువ్వాడ జగన్నాథం’, ‘అల వైకుంఠపురములో..’ సినిమాలు వచ్చాయి. రెండూ మంచి విజయమే అందుకున్నాయి. ఆ తర్వాత ఓ రెండు ప్రాజెక్ట్‌లు ప్రకటించినా పట్టాలెక్కలేదు. అవే అల్లు అర్జున్ ‘దేవర’, ‘ఐకాన్’. ‘దేవర’ అల్లు అర్జున్ ఏంటి అనేగా అనుకుంటున్నారు. ఆ విషయం ఆఖరులో చూద్దాం.
అల్లు అర్జున్ త్వరలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ మధ్య సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. అందులో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకుందాం అనుకుంటున్నారట. మామూలుగా అయితే ఈ కాంబో ఎవరూ ఊహించలేం. ఎందుకంటే పూజకి ఈ మధ్య సరైన హిట్సే లేవు. దీంతో ఛాన్స్‌లే కష్టం అనుకున్నారంతా. అయితే ‘కూలీ’లో ‘మోనికా..’ సాంగ్ చేశాక తిరిగి ఆమె స్వింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు ‘కూలీ’ సినిమా తీసిన దర్శకుడి సినిమాలో హీరోయిన్ అవ్వబోతోంది.
ఇదంతా ఓకే కానీ.. అల్లు అర్జున్ ‘దేవర’ ఏంటి అనేగా డౌట్. కొరటాల శివ ఆ కథను తొలుత బన్నీతో చేద్దాం అనుకున్నారు. ఈ మేరకు సముద్రం, తెప్పలు, రక్తం కాంబినేషన్‌లో ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అదే అల్లు అర్జున్ 21వ సినిమా. ఆ తర్వాత ఈ కథ తారక్ దగ్గరకు వెళ్లింది. అచ్చంగా ‘గాడ్ ఆఫ్ వార్’ తరహాలోనే. అదన్నమాట మేటర్.