“ఉయ్యాల జంపాల, ఎక్కడికి పోతావు చిన్నవాడ” ఫేమ్ ఆవికా గోర్ హీరోయిన్ గా నటిస్తూ నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించగా రూపొందిన చిత్రం “పాప్ కార్న్”. సాయిరోనక్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 10) విడుదలైంది. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిన్న సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలా ఫీలయ్యే నవతరం యువతి సమీరణ (ఆవికా గోర్), తాతయ్య కలను తాను నెరవేర్చాలని తపించే మ్యూజిషియన్ పవన్ (సాయిరోనక్). ఈ ఇద్దరూ ఉప్పల్ మాల్ లోని లిఫ్ట్ లో ఇరుక్కుంటారు. ఆ మాల్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణంగా మాల్ నుంచి జనాలు పారిపోవడం, పోలీసులు ఆ మాల్ ను సీజ్ చేయడంతో సహాయం చేయడానికి ఎవరూ లేక లిఫ్ట్ లోనే ఉండిపోతారు. సమీరణ, పవన్ లు ఆ లిఫ్ట్ లో ఏం చేశారు? ఎలా బయటపడ్డారు? అనేది “పాప్ కార్న్” కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమా మొత్తం కనిపించేది ఆవికా గోర్ & సాయి రోనక్ మాత్రమే. మొదటి పది నిమిషాలు మరియు చివరి 5 నిమిషాలు మాత్రమే కాస్త వేరే ఆర్టిస్టులు కనిపిస్తారు. ఆవిక ఈ పాత్రలో చాలా అసహజంగా కనిపించింది. అందుకే ఆమె పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేరు. అలాగే.. సాయిరోనక్ పాత్ర కూడా అదే తరహాలో ఉంటుంది.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డి పనితనాన్ని మెచ్చుకోవాలి. గంటన్నరకు పైగా సినిమా మొత్తం లిఫ్ట్ లోనే సాగినప్పటికీ.. ఉన్న కొద్దిపాటి స్పేస్ లో నేర్పుతో జనాలకు చిరాకు రాకుండా చేశాడు. శ్రవణ్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అంటే నమ్మడం కాస్త కష్టమైంది. రెండు పాటలు మినహా నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా గిటార్ ట్యూన్స్ తో వచ్చే వరుస పాటలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.
ప్రొడక్షన్ డిజైన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దర్శకుడు మురళి ఎంచుకున్న కథలో కానీ, కథనంలో కానీ పస లేదు. అందువల్ల.. 133 నిమిషాల నిడివి గల సినిమా కూడా 300 నిమిషాల్లా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం హాస్యాస్పదంగా ఉండడం సినిమాకి మెయిన్ మైనస్. కాన్సెప్ట్-కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం అందించిన మురళి గంధం అన్నీ విభాగాల్లోనూ విఫలమయ్యాడు.
విశ్లేషణ: ఎంత చిన్న సినిమా, టాలెంట్ ఉన్న నటీనటులు, ప్రయోగాత్మక చిత్రమని సర్ధి చెప్పుకొని సినిమా చూద్దామనుకున్నా.. అపరిమిత ల్యాగ్ & కదలిక లేని కథ వల్ల “పాప్ కార్న్” ఒక బోరింగ్ సినిమాగా & విజయ తీరానికి చేరలేని ప్రయోగంగా మిగిలిపోయింది.
రేటింగ్: 2/5
Click Here To Read in ENGLISH