బహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు డార్లింగ్ తో సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. తెలుగు అభిమానులతో పాటు పొరుగు రాష్ట్రాల వారిని మెప్పించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టు కథ, నటీనటులు, టెక్నీషియన్లు అవసరమవుతారు. ప్రభాస్ కి పెరిగిన మార్కెట్ కి సరితూగేలా నిర్మించాలి. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని బాహుబలి తర్వాత డార్లింగ్ చేయనున్న సినిమా బడ్జెట్ ని పెంచారు.
“రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రానున్న యంగ్ రెబల్ స్టార్ ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు. యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం మొదట 100 కోట్లు ఖర్చుఅవుతుందని భావించారు. తాజాగా ఆ బడ్జెట్ ని 150 కోట్లకు పెంచారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా ప్రభాస్ నటించనున్న ఈ సినిమా 2017 జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.