అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న సాహోలో ప్రభాస్ క్యారక్టర్

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాకి సంబంధించి ప్రతి విషయం ఆసక్తిని కలిగిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ కి ముందే టీజర్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన యువ దర్శకుడు సుజీత్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు. అంతేకాదు తమిళనటుడు అరుణ్ విజయ్, మల్లూవుడ్ సీనియర్ నటుడు”లాల్” కూడా సాహోలో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. దీని తర్వాత దుబాయ్ శివార్లలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ను మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేయనున్నారు. ఇందులో ప్రభాస్‌ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారని మొదటి నుంచి టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ పాత్రలో విలన్ షేడ్స్‌ కూడా ఉంటుందని తెలిసింది. ప్రభాస్‌ పోలీసు ముసుగులో ఉన్న దొంగా? లేక నిజాయతీ గల అధికారా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఈ అంశమే ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా దీపావళికి థియేటర్లోకి రావచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus