సంక్రాంతి బరిలో దిగుతున్న ‘ది రాజా సాబ్’ సినిమాపై అంచనాలు పాజిటివ్ గానే ఉన్నాయి. ముఖ్యంగా విజువల్స్, ప్రభాస్ లుక్స్ చూశాక ఫ్యాన్స్ లో నమ్మకాలు మొదలయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా నిడివి గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైనల్ కట్ విషయంలో మేకర్స్ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. మొదట అనుకున్న దానికి, ఇప్పుడు లాక్ చేసిన దానికి చాలా తేడా ఉంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మొదట ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ దాదాపు 3 గంటల 10 నిమిషాలు వచ్చిందట. ఇంత భారీ నిడివి ఉంటే ఆడియన్స్ కు బోర్ కొట్టే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపించాయి. కానీ తాజా అప్డేట్ ప్రకారం.. ఎడిటింగ్ టేబుల్ దగ్గర గట్టి కసరత్తు చేసి, సినిమాను 2 గంటల 55 నిమిషాలకు కుదించినట్లు సమాచారం. అంటే దాదాపు 15 నిమిషాల నిడివికి కత్తెర పడిందన్నమాట.
అయితే ఈ నిర్ణయం వెనుక స్వయంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారట. రషెస్ చూసుకున్న తర్వాత, కొన్ని అనవసరమైన సీన్స్ సినిమా ఫ్లోను దెబ్బతీస్తున్నాయని ఆయన భావించినట్లు టాక్. ఈ రోజుల్లో ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉంది కాబట్టి, సాగదీత లేకుండా క్రిస్ప్ గా ఉంటేనే బెటర్ అని ప్రభాస్ సూచించారట. ఆయన సలహా మేరకే డైరెక్టర్ మారుతి ఆ సీన్స్ ను తొలగించి ఫైనల్ కట్ రెడీ చేశారని వినికిడి.
నిజానికి ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకు 3 గంటల నిడివి కామన్ అయిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి’ లాంటి సినిమాలు మూడు గంటలు ఉన్నా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. కానీ ‘రాజా సాబ్’ అనేది హారర్ కామెడీ జోనర్. ఇందులో ఎక్కడ ల్యాగ్ ఉన్నా కామెడీ వర్కౌట్ అవ్వదు. అందుకే రిస్క్ తీసుకోకుండా, ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా రన్ టైమ్ ను సెట్ చేశారు. ఇది సినిమా రిజల్ట్ కు ప్లస్ అయ్యే పాయింటే. ప్రస్తుతం ఈ వెర్షన్ నే సెన్సార్ కు పంపడానికి రెడీ చేస్తున్నారు. 2 గంటల 55 నిమిషాలు అంటే పర్ఫెక్ట్ రన్ టైమ్ అని చెప్పొచ్చు.