ఒక్కోసారి కొన్ని సినిమాలు హిట్ అవ్వడం అనేది సదరు సినిమాలో భాగమైనవారి జీవితాలను పూర్తిగా మార్చేసి.. వారి తదుపరి సినిమాల సమీకరణలు పూర్తిగా మార్చేస్తాయి. ఇప్పుడు ప్రభాస్ (Prabhas) -సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రాజెక్ట్ విషయంలో సరిగ్గా అదే జరుగుతుంది. నిజానికి ఈ సినిమాను ఓ 250 కోట్ల రూపాయల బడ్జెట్ లో పూర్తి చేయాలి అనుకున్నారు. కానీ.. “కల్కి” (Kalki 2898 AD) 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన “యానిమల్” (Animal) కూడా 1000 కోట్ల మార్క్ కి కొద్దిలో మిస్ అవ్వడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ సంస్థలు “స్పిరిట్” (Spirit) సినిమాకి ఏకంగా 500 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట.
దాంతో.. తాను అనుకున్న రీతికి ఏమాత్రం తగ్గని విధంగా యాక్షన్ బ్లాక్స్ ను తెరకెక్కించడానికి సన్నద్ధమవుతున్నాడు సందీప్ రెడ్డి. అలాగే.. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor) ను ఫైనల్ చేశారని కూడా తెలుస్తోంది. ఇకపోతే.. ఈ సినిమాలో విలన్ గా కొరియన్ టాప్ స్టార్ డాన్ లీ కోసం బృందం ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కన పెట్టారట.
ఓ బాలీవుడ్ సీనియర్ హీరోను విలన్ రోల్ కోసం ఒప్పించే పనిలో సందీప్ రెడ్డి ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించిన సదరు బాలీవుడ్ హీరో సందీప్ రెడ్డి చెప్పే క్యారెక్టర్ నచ్చి ప్రభాస్ ముందు ప్రతినాయకుడిగా నిలబడేందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఇవన్నీ చూస్తుంటే.. “స్పిరిట్” ముందు అనుకున్నదానికంటే భారీ స్థాయిలో సిద్ధమవుతుందని తెలుస్తోంది.
ప్రభాస్ మాత్రం “స్పిరిట్”తోపాటుగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో మొదలైన “ఫౌజీ” (ఫ్యాన్స్ డిసైడ్ అయిన టైటిల్) మరియు “సలార్ 2” షూటింగ్ షెడ్యూల్స్ తో యమ బిజీగా ఉన్నాడు. ఆయన అభిమానులు కోరుకున్నది కూడా ఇదే అనుకోండి!