నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకొని, మినిమం గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్న సుహాస్ (Suhas) ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం “ప్రసన్న వదనం” (Prasanna Vadanam) . సుకుమార్ (Sukumar) అసిస్టెంట్ డైరెక్టర్స్ బ్యాచ్ లో ఒకడైన అర్జున్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఫేస్ బ్లైండింగ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూద్దాం..!!
కథ: సూర్య (సుహాస్) ఓ యాక్సిడెంట్ లో తల్లిదండ్రులతోపాటు మనుషుల మొహాలు చూసి గుర్తుపట్టే సెన్స్ ను కోల్పోతాడు. ఆ కారణంగా సొంత మనుషులను గుర్తుపట్టడానికి కూడా చాలా ఇబ్బందిపడుతుంటాడు. అలాంటోడు ఓ వర్షం పడిన సాయంత్రం వేళ నడిరోడ్డుపై అమృత (సాయిశ్వేత)ను ఒకరు లారీ కిందకు తోసి చంపేగా చూస్తాడు. అయితే.. తనకున్న ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా తోసింది ఎవరు అనేది గుర్తుపట్టలేకపోతాడు.
తాను చూసిన హత్యను తరువాతి రోజు వార్తల్లో యాక్సిడెంట్ గా చూసి షాకై.. వెంటనే పోలీసులకు ఎలాగైనా నిజం చెప్పాలనే ఆలోచనతో పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్తాడు. అక్కడినుండి సూర్యకు కష్టాలు మొదలవుతాయి.
అసలు అమృత ఎవరు? ఆమెను చంపింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? ఈ మిస్టరీని సూర్య ఎలా ఛేదించాడు? ఈ మిస్టరీలో ఇరుక్కున్న సూర్య ఎలాంటి కష్టాలు అనుభవించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ప్రసన్న వదనం”.
నటీనటుల పనితీరు: సుహాస్ మంచి నటుడే, కానీ గత రెండు మూడు సినిమాల్లో అతడి హావభావాలు కాస్త మొనాటనస్ గా ఉంటున్నాయి. “ప్రసన్న వదనం”లో ఆ మొనాటనీ నుండి కాస్త బయటపడ్డాడు. అయితే.. కీలకమైన సన్నివేశాల్లో మాత్రం హావాభావాలతో ఆకట్టుకోవడానికి కాస్త కష్టపడుతున్నాడు. స్క్రిప్ట్ సెలక్షన్ లో సుహాస్ కి ఉన్న తెగువకు, చక్కని హావభావాలు, సినిమా సినిమాకి స్టైలింగ్ లో కాస్త భిన్నత్వం తోడైతే డిపెండబుల్ హీరోగా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదు.
సుహాస్ తో సమానంగా, ఇంకా చెప్పాలంటే సుహాస్ ను డామినేట్ చేసే స్థాయి నటనతో అలరించిన నటి రాశీ సింగ్. ఆమె పాత్రలో నటనకు, వేరియేషన్స్ చూపించడానికి మంచి స్కోప్ ఉంది. ఆ స్కోప్ ను సరిగ్గా వాడుకొని తన సత్తాను చాటుకుంది రాశీ. వైవా హర్ష (Viva Harsha) , (Payal Radhakrishna) పాయల్ రాధాకృష్ణ, నితిన్ ప్రసన్న (Nitin Prasanna) తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతికవర్గం పనితీరు: విజయ్ బుల్గానిన్ ( Vijay Bulganin) నేపథ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ & సెకండాఫ్ లో వచ్చే ఇంటెన్స్ సీన్స్ ను విజయ్ బుల్గానిన్ తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసిన తీరు ప్రశంసనీయం. చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ టీమ్ మాత్రం చాలా చోట్ల కంటిన్యూటీ మిస్ అయ్యారు. ఉదాహరణకి హీరోయిన్ హెయిర్ కలర్ షాట్ మొదటిసారి కార్ షోరూమ్ లో ఆమె ఇంట్రడక్షన్ అప్పుడే కనిపించేస్తుంది. అలాగే.. నితిన్ ప్రసన్న హెయిర్ స్టయిల్ సీన్ సీన్ కి మారిపోతుంటుంది. బడ్జెట్ ఇబ్బందులు ఉన్నాయని అర్థమవుతున్నప్పటికీ.. థ్రిల్లర్స్ విషయంలో కంటిన్యూటీ ఎంత కీలకపాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని బృందం కాస్త సీరియస్ గా తీసుకోవాల్సింది.
ఇక దర్శకుడు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. కథకుడిగా ఎక్కువ లేట్ చేయకుండా.. టైటిల్ కార్డ్ నుంచే అసలు కథ మొదలెట్టేశాడు. ముఖ్యంగా సైకో కిల్లర్స్ ఫైట్స్ సీక్వెన్స్ & గోవింగ్ ఛేజింగ్ ఎపిసోడ్ ను కంపోజ్ చేసిన తీరు దర్శకుడిగా అర్జున్ పనితననానికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే.. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న కథలోకి రొమాన్స్ ను జొప్పించడం కోసం రాసుకున్న సన్నివేశాలు పెద్దగా వర్కవుటవ్వకపోగా.. సెకండాఫ్ లో సదరు సన్నివేశాలు మైనస్ గా నిలిచాయి. అయితే.. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ & రైటర్ గా అర్జున్ అదరగొట్టాడనే చెప్పాలి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు మలయాళ చిత్రం “ఇష్క్”, హిందీ చిత్రం “గజినీ”లను గుర్తుకు తీసుకొచ్చినప్పటికీ.. వాటిని తన సినిమాకు తగ్గట్లుగా మార్చుకున్న విధానం బాగుంది.
విశ్లేషణ: తెలుగులో కాన్సెప్ట్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఆ క్యాటగిరీలో మంచి కంటెంట్ ఉన్న సినిమాగా “ప్రసన్న వదనం” నిలుస్తుంది. చక్కని కథ, అలరించే కాన్సెప్ట్, ఆసక్తికరమైన కథనం, థ్రిల్లింగ్ ట్విస్టులు, ఆకట్టుకునే ప్రధాన పాత్రధారుల పెర్ఫామెన్స్ కలగలిసి “ప్రసన్న వదనం” చిత్రాన్ని మంచి హిట్ గా మలిచాయి. సరిగ్గా ప్రమోట్ చేసుకోగలిగితే.. థియేటర్లో సరైన స్ట్రెయిట్ తెలుగు సినిమా లేక డీలాపడిన ప్రేక్షకులతో హౌస్ ఫుల్స్ అవ్వడం ఖాయం.
ఫోకస్ పాయింట్: ప్లెజంట్ గా థ్రిల్ చేసే “ప్రసన్న వదనం”.
రేటింగ్: 3/5