Prasanth Varma: ‘జై హనుమాన్‌’ మెతుకు అదిరిపోయింది… మీరు చూశారా?

అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి మొత్తం అన్నం చూడక్కర్లేదు… ఒక్క మెతుకు చూస్తే చాలు అని అంటారు పెద్దలు. ఈ నానుడిని సినిమాలకు అన్వయిస్తే… సినిమా ఎలా ఉందో చెప్పడానికి మొత్తం సినిమా చూడక్కర్లేదు.. ఓ సీన్‌ చూస్తే చాలు అనొచ్చు. అలా అని అన్ని సినిమాలకు ఈ పాయింట్‌ వర్తించదు అనుకోండి. ఇక విషయానికొస్తే అలాంటి ఓ మెతుకు ఇప్పుడు బయటకు వచ్చింది. మొన్న సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి అందరూ మెచ్చిన సినిమాగా మారింది ‘హనుమాన్‌’(Hanuman)  . తేజ సజ్జా(Teja Sajja) , ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌ ఉందని క్లైమాక్స్‌లో చెప్పేశారు.

‘జై హనుమాన్‌’ పేరుతో ఆ సినిమాను రిలీజ్‌ చేస్తామని చిత్రబృందం ఇప్పటికే చెప్పేసింది. వచ్చే ఏడాది వస్తాం అని కూడా చెప్పారు. అయితే ఇప్పటివరకు సినిమా మొదలవ్వలేదు. ఏదో అన్నారు కానీ వచ్చేయగలరా అనే డౌటానుమానం చాలామందిలో ఉంది. దీనికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. చూడటానికి మోషన్‌ పోస్టర్‌లా కనిపిస్తున్న ఆ వీడియోలో అంజనాద్రి ప్రాంతాన్ని చూపించారు. ‘హను – మాన్‌’లో ఆ ప్రాంతమే కీలకం అనే సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు చూపించిన ప్రాంతం ‘అంజనాద్రి 2.0’. అంటే ‘జై హనుమాన్‌’ కోసం ఆ ప్రాంతం (విజువల్‌ ఎఫెక్ట్స్‌తో) సిద్ధం చేశారన్నమాట. అంటే సినిమా షూటింగ్‌ త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తారు అని చెప్పాలి. చుట్టూ అందమైన కొండలు.. మధ్యలో పెద్ద నది.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపిస్తూ ‘వెల్‌కమ్‌ టు అంజనాద్రి 2.0’ అని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఆ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. ‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానమే ‘జై హనుమాన్‌’ అనే సంగతి తెలిసిందే.

‘హను – మాన్‌’ సినిమా కంటే వంద రెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉంటుందని టీమ్‌ చెబుతోంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. హనుమంతు పాత్రలో మాత్రమే కనిపిస్తాడు. ఆ సినిమాలో హీరో ఆంజనేయ స్వామి అని అంటున్నారు. ఆ పాత్రను ఓ స్టార్‌ హీరో చేస్తారట. అయితే ఈ సినిమా కంటే ముందే ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘అధీర’, ‘మహాకాళి’ సినిమాలు రిలీజ్‌ అవుతాయట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus