అభిలాష్-ప్రియ వడ్లమణి జంటగా తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ “ప్రేమకు రైన్ చెక్”. నవతరం ప్రేమల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ఆకేళ్ళ పేరి శ్రీనివాస్ దర్శకుడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? జనాల్ని ఏమేరకు అలరించగలిగింది అనేది చూద్దాం..!!
కథ : విక్కీ (అభిలాష్) అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏజెన్సీకి బాస్.. అదే కంపెనీలో పనిచేసే రమ్య (ప్రియ వడ్లమణి)తో స్నేహంగా మెలుగుతుంటాడు. వర్క్ పరంగానే కాకుండా వ్యక్తిత్వం పరంగానూ పర్ఫెక్ట్ అయిన విక్కీని ప్రేమిస్తుంది రమ్య. తన ప్రేమను విక్కీకి వ్యక్తపరచాలనుకొనే సమయానికి విక్కీ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎంటరవుతుంది తాన్య (మోనిక). ఉన్నట్లుండి విక్కీ-రమ్యల మధ్యలోకి వచ్చిన తాన్య ఎవరు? చివరికి విక్కీ-రమ్యలు కలిశారా లేదా? అనేది “ప్రేమకు రైన్ చెక్” కథాంశం.
నటీనటుల పనితీరు : తొలి సినిమా అయినప్పటికీ అభిలాష్, ప్రియ వడ్లమాణీలు పరిణితితో నటించారు. ఆ ఇద్దరి పాత్రలకు యూత్ కూడా కనెక్ట్ అవుతారు. వారిమధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది. తాన్య పాత్రలో మోనిక సినిమాకి కావాల్సిన గ్లామర్ అద్దింది. ఆమె క్యారెక్టరైజేషన్ కు మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు.
క్లైమాక్స్ లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల డీలింగ్, ఆ సన్నివేశాల్లో నటీనటుల ప్రతిభ ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి. రఘు కారుమంచు, కిరీటి దామరాజుల కామెడీ పెద్దగా పండలేదు కానీ.. వారి స్క్రీన్ ప్రెజన్స్ ఆడియన్స్ ను అలరిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు : శరత్ గురువుగారి సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది. మీడియం బడ్జెట్ లో భారీ సినిమా స్థాయి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు శరత్. అద్భుతం అనదగ్గ కెమెరా యాంగిల్స్-ఫ్రేమ్స్ లేవు కానీ ఒక కమర్షియల్ ఫార్మాట్ సినిమాకి కావాల్సిన కెమెరా వర్క్ తో ఆకట్టుకొన్నాడు ఛాయాగ్రహకుడు. దీపక్ కిరణ్ స్వరపరిచిన బాణీలు గుర్తుంచుకొనే స్థాయిలో లేకపోయినా.. ఈడీయమ్స్ మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడి చేత తనకు తెలియకుండానే కాళ్ళు కదిపేలా చేస్తుంది.
ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ టర్నడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ 50 ఏళ్ల వయసులో నవతరం ప్రేమలను, వారి మనోభావాలను అర్ధం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ప్రేమ-కెరీర్ నడుమ ఏది ఇంపార్టెంట్ అనేది ఆయన వివరించిన విధానం బాగుంది కానీ.. కవితాత్మకంగా తెరకెక్కించాలని చేసిన ప్రయత్నంలో కమర్షియల్ అంశాలను జొప్పించాలనుకోవడం ఒకటే మైనస్ గా మారింది. కేవలం యూత్ ను మాత్రమే టార్గెట్ చేసిన ఈ చిత్రంలో మాస్ అంశాలు పెద్దగా లేవు. మోనిక గ్లామర్ ను కూడా సరైన విధంగా యూటిలైజ్ చేయలేకపోయారు.
అయితే.. సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ మాత్రం సినిమాలో కంటే ఆ సినిమాని జనాలకు చేరువ చేయడం కోసం చేసిన ప్రమోషన్స్ లో ఎక్కువగా కనిపించింది. ఇండస్ట్రీకి ఈ తరహా దర్శకనిర్మాతలు ఇంకా రావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకులు కూడా ఈ తరహా చిత్రాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విశ్లేషణ : అందరూ కొత్తవారే కాబట్టి ప్రేక్షకులు పెద్దగా ఎక్స్ పెక్ట్ చేసి థియేటర్ కి వెళ్లరు కాబట్టి “ప్రేమకు రెయిన్ చెక్” చిత్రం నిరాశపరచదు. సో, డియర్ మూవీ లవర్స్ టైమ్ పాస్ కోసం ఈ చిత్రాన్ని సరదాగా ఒకసారి చూడవచ్చు.
రేటింగ్ : 2/5