సినిమా ఓ అద్భుతం. మనల్ని నవ్విస్తుంది… ఏడిపిస్తుంది… ఆశ్చర్యపరుస్తుంది. మూడు గంటల్లో ప్రపంచంలోని అందమైన ప్రాంతాలను చూపిస్తుంది. అంతెందుకు పదేళ్ల ముందుకు.. వందేళ్ల వెనక్కి తీసుకు పోతుంది. ఇదివరకు ఎన్నో సినిమాలు నడుస్తున్న కాలం నుంచి వెనక్కి వెళ్లాయి. ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టాయి. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు మనల్ని వెనక్కి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ఆ చిత్రాలపై ఫోకస్..
మహానటితెలుగువారు గర్వించే నటి సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. సావిత్రిగా కీర్తిసురేష్ నటిస్తుండగా, సమంత కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో సావిత్రి జీవితంలో అటు వ్యక్తిగతంగానూ, ఇటు వృత్తి పరంగానూ చోటు చేసుకున్న వివిధ సంఘటనలను నాగ్ అశ్విన్ చూపించనున్నారు. అంటే మనల్ని 50-80 ఏళ్ళ వెనక్కి ఈ సినిమా తీసుకు పోనుంది.
సైరా నరసింహా రెడ్డిప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (1857) కంటే ముందు… అంటే 1840 లో బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, వారికి కంటిమీద కునుకులేకుండా చేసి, సమరయోధుడిగానే జీవితాన్ని చాలించిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గా చిరంజీవి నటిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌పై రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితమే నాటి పరిస్థితిని కళ్లకు కట్టనుంది.
ఎన్టీఆర్తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చిన ఘనుడు నందమూరి తారక రామారావు నిజ జీవితాన్ని తేజ వెండితెరపై బంధిస్తున్నారు. ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలయింది. 1923 నుంచి 1996 వరకు ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో పొందు పరచనున్నారు.
1945దగ్గుబాటి రానా చేస్తున్న మరో చారిత్రాత్మక చిత్రం 1945 . సుభాష్ చంద్ర బోస్ జీవితం ఆధారంగా రూపుద్దికోనున్న ఈ మూవీలో స్వతంత్ర సంగ్రామాన్ని చూపించబోతున్నారు.
యాత్రమహా నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథను మహివి రాఘవ్ వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా వైస్సార్ సీఎం కావడానికి సహకరించిన పాదయాత్రను ప్రధానంగా చూపించనున్నారు. వైఎస్సార్ పాత్రను మలయాళ స్టార్ మమ్ముట్టి పోషించనున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి “యాత్ర” అనే టైటిల్ ఖరారు చేశారు. ఇరవై ఏళ్ళక్రితంనాటి ఆంధ్రపదేశ్ ని ఈ మూవీ తాజాగా చూపించనుంది.
ఇవన్నీ రానున్న సినిమాలైతే రీసెంట్ గా (మార్చి 30 న) రిలీజ్ అయిన రంగస్థలం నేటి ప్రేక్షకులకు పాతికేళ్ల క్రితం పల్లెటూరు, అప్పటి రాజకీయ పరిస్థితులను పరిచయం చేసింది. రామ్ చరణ్, సమంతలు ఆనాటి యువతీయువకుల్లా చక్కగా నటించి మంచి విజయాన్ని సొంతంచేసుకున్నారు. సుకుమార్ అందరితో అభినందనలు అందుకున్నారు.