‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్.!

  • February 21, 2020 / 01:07 PM IST

ఈ మధ్యకాలంలో విడుదలైన టీజర్, ట్రైలర్స్ లో ప్రేక్షకుల్ని బాగా అట్రాక్ట్ చేసిన వాటిలో ‘ప్రెజర్ కుక్కర్’ టీజర్, ట్రైలర్లు కూడా ఒకటని.. నిస్సందేహంగా చెప్పొచ్చు. దీంతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సాయి రోనాక్, ప్రీతీ అస్రాని జంటగా నటించిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, తనికేళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. సుజోయ్ అండ్ సుశీల్.. డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న (ఈరోజు) విడుదలైంది. మరి టీజర్, ట్రైలర్ లకు తగినట్టు ఈ చిత్రం అలరించిందా.. తెలుసుకుందాం రండి.

కథ : చిన్నప్పటి నుండీ తన తండ్రి(సి.వి.ఎల్ నారాయణ) మాట ప్రకారం ఎలాగైనా అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు కిషోర్(సాయి రోనాక్). చదువు పూర్తయ్యి సంవత్సరం అవుతున్నా విసా కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. రెండు సార్లు రిజెక్ట్ అయిన తర్వాత.. ఊర్లో అందరూ అడుగుతూ విసిగిస్తూ ఉండడంతో హైదరాబాద్ లోని తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్తాడు. అక్కడ అనిత(ప్రీతి అస్రాని) అనే అమ్మాయితో తో ప్రేమలో పడతాడు.

ఇదిలా ఉండగా అనుకోకుండా మూడో సారి కూడా వీసా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతాడు. కన్సల్టెన్సీ అప్రోచ్ అయినా లాభం ఉండదు. దీంతో బాగా పలుకుబడి ఉన్న ఓ వ్యక్తిని సాయం కోరతాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి 25 లక్షలు లంచం అడుగుతాడు. విషయం తెలుసుకున్న కిశోర్ నాన్న వెంటనే పొలం తాకట్టు పెట్టి మరీ డబ్బులు పంపిస్తాడు. అయితే ఆ పలుకుబడి గల వ్యక్తి ఫ్రాడ్ అని తెలుస్తుంది. తన తండ్రి పొలం తాకట్టు పెట్టి ఇచ్చిన 25 లక్షలు సైతం పోగొట్టుకుంటాడు. తరువాత కిశోర్ ఏం చేసాడు? చివరికి అమెరికా వెళ్లాడా? తన తండ్రి కోరికని తీర్చడా? అనేది మిగిలిన కథాంశం.

నటీనటుల పనితీరు : ‘లంక’ ‘మసక్కలి’ ‘కాదలి’ వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి రోనాక్ ఈసారి కూడా తన నటనతో మెప్పించలేకపోయాడు. కొన్ని కామెడీ సీన్స్ లో ఓకే అనిపించినా ఎమోషనల్ సీన్స్ లో పూర్తిగా తేలిపోయాడు. ఇక ‘మళ్ళీ రావా’ చిత్రంలో చిన్నప్పటి హీరోయిన్ పాత్ర పోషించిన ప్రీతి అస్రాని ఈ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

హీరోతో పోలిస్తే ఆమె కాస్త యాక్టివ్ గానే నటించడానికి ట్రై చేసింది… కానీ ఇంకా చిన్న పిల్ల మాదిరిగానే కనిపిస్తుండడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఈమె పాత్రకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. స్నేహితులుగా చేసిన రాహుల్ రామకృష్ణ, రాజై రోవాన్ ల కామెడీ.. చాలా అంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. వారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో దర్శకులు అనే డౌట్ చివరి వరకూ వెంటాడుతూనే ఉంటుంది. ఉన్నంతలో రొటీన్ గా అనిపించినా తనికేళ్ల భరణి, సి.వి.ఎల్ నారాయణ పాత్రలు కాస్త పర్వాలేదు అనిపిస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు : సినిమాటోగ్రఫర్లుగా నగేష్ అండ్ అనిత్ లు పనిచేసారు. హైలెట్ అంటూ ఉంటే వీరి గురించే చెప్పుకోవాలి. చిన్న సినిమా అయినప్పటికీ కాస్త రిచ్ లుక్ వచ్చేలా చేశారు. ఇక సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరన్, హర్షవర్ధన్ రామేశ్వర్ వంటి నలుగురు సంగీత దర్శకులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా గుర్తుంచుకునే పాటలు ఇవ్వలేకపోయారు.. అయితే కొంతమేర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అని చెప్పొచ్చు. సుజోయ్ అండ్ సుశీల్ దర్శకులుగానే కాకుండా నిర్మాతలుగా కూడా పనిచేసిన చిత్రం ఇది.

భవిష్యత్తులో ఓకే సినిమాకి ఇద్దరు దర్శకులు పనిచేయకూడదు అని.. ఈ చిత్రాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. టీజర్, ట్రైలర్స్ లో వీళ్ళు చూపించింది ఒకటి అయితే సినిమాలో ప్రెజెంట్ చేసింది మరొకటి. ఇద్దరికీ రెండు అభిప్రాయాలు ఉండడం వల్ల అనుకుంట.. ఓ సీన్ ఒకలా ఉంటే మరో సీన్ ఇంకోలా అనిపిస్తుంటుంది. ‘పెళ్లి చూపులు’ దగ్గర్నుండీ ‘శతమానం భవతి’ ‘ప్రతీరోజూ పండగే’ ‘బొమ్మరిల్లు’ వంటి సూపర్ హిట్ సినిమాల రెఫరెన్సులు ఈ చిత్రంలో పుష్కలంగా నింపేశారు.

కొన్ని కొన్ని చోట్ల ఆ సూపర్ హిట్ సినిమాలకి స్పూఫ్ లేమో అనే డౌట్ కూడా తెప్పిస్తాయి ఆ సీన్లు. అసలు హీరో వీసా ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు మొదట ఉన్న వారు సిల్లీ ఇంగ్లీష్ మాట్లాడినా .. అమెరికా వెళ్లడానికి సిల్లీ రీజన్స్ చెప్పినా వీసా ఇచ్చేస్తారు కానీ హీరోని మాత్రం సిల్లీ రీజన్స్ తో రిజెక్ట్ అయినట్టు చూపిస్తారు. అసలు హీరోకి ప్రెజర్ ఎక్కడ ఉంది అనేది పెద్ద సందేహం కలిగిస్తుంటుంది.తన డబ్బులు పోయినప్పుడు దాని గురించి కంప్లైంట్ ఇచ్చి ఎంక్వయిరీ చేయించడం మానేసి సింపుల్ గా మీ డబ్బు మీకిచ్చేస్తాను అని తన తండ్రితో చెబుతాడు హీరో. వెంటనే హీరోయిన్ తో రొమాన్స్ ట్రాక్ ఉంటుంది. అన్నీ లాజిక్ లెస్ గా అనిపిస్తుంటాయి. ఏదేమైనా డైరెక్షన్ కానీ.. స్క్రీన్ ప్లే కానీ ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేకపోగా విసిగిస్తుంది.

విశ్లేషణ : టీజర్, ట్రైలర్ చూసి ఏదో ఉంది అనుకుని సినిమాకి వస్తే అడ్డంగా బుక్ అయిపోయినట్టే. ఈ ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాలో హీరో పై ప్రెజర్ ఏమీ లేదు కానీ అది చూడటానికి వచ్చే ఆడియెన్స్ కు మాత్రం పెద్ద ‘ప్రెజర్’ పెట్టేలానే ఉంటుంది.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus