గత కొన్ని రోజులుగా ఇండియన్ సినిమాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం ‘పని గంటలు’. అంతకుముందు ఎక్కువగా వినిపించిన విషయం అంటే ‘రెమ్యూనరేషన్’. ఇండియన్ సినిమాలో హీరోలు, హీరోయిన్ల మధ్య వయసు గ్యాప్‌తో పాటు రెమ్యూనరేషన్ గ్యాప్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటూ అప్పట్లో చురకలు వినిపించేవి. అయితే ఆ గ్యాప్ ఇప్పటికీ తగ్గేలేదు అనుకోండి. ఇప్పుడు అయితే పని గంటల కాన్సెప్ట్ బయటకు వచ్చింది. దీపిక పడుకొణె విషయంలో బయటకు వచ్చిన ఈ చర్చ.. హీరోలు టైమ్‌కి సెట్స్‌కి రారు అనే మాటతో మరింత పెరిగింది.
బాలీవుడ్‌లో ఈ పరిస్థితి ఎక్కువని చాలా రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. పని గంటలు గురించి మమ్మల్ని అంటారు కానీ.. బాలీవుడ్‌లో కొంతమంది హీరోలు చెప్పిన సమయానికి రారు అని దీపిక పడుకొణె చెప్పింది. ఇప్పుడు ప్రియమణి కూడా ఇదే మాట అంటోంది. అయితే ఆమె చెప్పేది షెడ్యూల్ మొదలయ్యే సమయం గురించి. ఇటీవల కాలంలో సౌత్ సినిమాలతోపాటు నార్త్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది ప్రియమణి. ఈ క్రమంలో రెండు పరిశ్రమల మధ్య తేడాలు చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.
తన సహనటుల కంటే తనకు తక్కువ పారితోషికం వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పిన ప్రియమణి.. ఆ విషయంలో తానెప్పుడూ బాధపడలేదు అని చెప్పింది. నేనెప్పుడూ రెమ్యూనరేషన్‌కి ప్రాధాన్యం ఇవ్వలేదు. స్టార్‌డమ్ ఆధారంగా పారితోషికం అందిస్తారని నాకు తెలుసు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకనిర్మాతలను డబ్బులు అడుగుతాను అని చెప్పింది. ఈ క్రమంతో తనతో కలసి నటించిన వారి కంటే తనకు తక్కువ రెమ్యూనరేషన్ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పింది
ఇక దక్షిణాది, ఉత్తరాది సినిమా పరిశ్రమల్లో షూటింగ్ టైమింగ్స్ గురించి కూడా ప్రియమణి మాట్లాడింది. రెండు ఇండస్ట్రీల్లో చిత్రీకరణ విధానం భిన్నంగా ఉంటుంది. దక్షిణాది సినిమా పరిశ్రమల్లో ఉదయం 8 గంటలకు షూటింగ్ ప్రారంభిస్తామని షెడ్యూల్ ఇస్తే కచ్చితంగా ఆ టైమ్‌కి ప్రారంభించేస్తారు. బాలీవుడ్‌లో ఆ సమయానికి నటీనటులు ఇంటి నుంచి బయల్దేరుతారు అని ప్రియమణి చెప్పింది.