‘గ్లోబ్‌ట్రాటర్’ అనే పేరు సినిమాకు ఖరారు చేశారో లేదో తెలియదు కానీ.. ఆ పేరు మీద #SSRMB / #SSMB29 సినిమా ప్రచారం ఓ లెవల్‌లో జరుగుతోంది. మొన్నీమధ్య ‘కుంభ’ అంటూ విలన్ పాత్రను పరిచయం చేసిన రాజమౌళి.. ఇప్పుడు ‘మందాకిని’ అంటూ హీరోయిన్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక 15వ తేదీ హీరో పాత్రను పరిచయం చేయడమే మిగిలింది. దాని కోసం రామోజీ పిల్మ్ సిటీలో దానికి సంబంధించి ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
ఇక, అసలు విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తోంది అనే విషయం ఎప్పుడో ఆమెనే లీక్ చేసేసింది. మొన్నీమధ్య మహేష్‌బాబు అండ్ రాజమౌళి అఫీషియల్‌గా లీక్ చేసేశారు. ఇప్పుడు ఆ లీక్‌ను నిజం చేస్తూ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో మందాకినిగా కనిపించబోతున్నట్లు చెప్పిన టీమ్.. చీరకట్టులో గన్ పేలుస్తూ యాక్షన్ మోడ్‌లో ప్రియాంకను చూపించింది. ఇటు గ్లామర్, అటు యాక్షన్‌ను కలగలిపి భలేగా చూపించారు రాజమౌళి.
ప్రపంచ వేదికపై ఇండియన్ సినిమాను పునర్ నిర్వచించిన మహిళ, మన దేశీ గర్ల్ మళ్లీ వచ్చేసింది. ‘మందాకిని’గా భిన్న పార్శ్వాలను చూడటానికి ప్రపంచం ఆసక్తితో ఎదురుచూస్తోంది అని రాజమౌళి ఈ సందర్భంగా ఎక్స్‌లో రాజమౌళి రాసుకొచ్చారు. ఆమె పైకి కనిపించే దాని కన్నా ఇంకా ఉన్నతంగా ఉంటుంది.. మందాకినికి హలో చెప్పండి అని ప్రియాంక తన పాత్ర గురించి రాసుకొచ్చింది. ఆమె వచ్చేస్తోంది.. ఇదిగో మందాకిని అంటూ మహేశ్ బాబు వెల్‌కమ్ చెప్పారు.
ఇక ప్రియాంక లుక్ వచ్చాక సినిమా విషయంలో ఇన్నాళ్లూ ఉన్న ఆలోచన మారిపోయింది అని చెప్పాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ వచ్చాక ఈ సినిమా మైథాలజీ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ అనిపించింది. ఇప్పుడు ప్రియాంకని సిల్క్ చీరకట్టులో చూపించి కొత్త ట్విస్ట్ ఇచ్చారు రాజమౌళి. ఆ ఫొటో చూసి ‘చీర కట్టిన గన్’ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.