గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” (Game Changer) విడుదలకు సమయం దగ్గరపడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమవుతున్న ఈ చిత్రం, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్లను వేగవంతం చేసి, సినిమాపై హైప్ పెంచే పనిలో ఉన్నారు. సినిమాపై పెట్టుబడులు దాదాపు 250 కోట్లకు పైగా ఉంటాయని చెప్పిన నిర్మాత దిల్ రాజు (Dil Raju) , సినిమాకు అవసరమైన ప్రాచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగనుండగా, ఈ సందర్భంగా చిత్ర బృందం మొత్తం అక్కడ పాల్గొనబోతోందని సమాచారం. ఈ ఈవెంట్ లో నాలుగో సాంగ్ కూడా విడుదల చేయబోతున్నారు, ఇప్పటికే టీజర్, మొదటి మూడు పాటల వల్ల భారీగా అంచనాలు పెంచిన సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించనుంది. ఇక బెనిఫిట్ షోలు అంశానికి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని దిల్ రాజు స్వయంగా వెల్లడించినట్లు సమాచారం.
“పుష్ప 2” (Pushpa 2: The Rule) బెనిఫిట్ షోల ద్వారా సాధించిన విజయాన్ని గమనించిన దిల్ రాజు, “గేమ్ ఛేంజర్”కూ అదే రీతిలో స్పెషల్ షోలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, ఇటీవల జరిగిన “పుష్ప 2” బెనిఫిట్ షో కారణంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని, మరింత పక్కా ప్లానింగ్ తో ఈ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక షోల కోసం టికెట్ ధరలపై ఇంకా స్పష్టత రాలేదు.
కానీ పక్కా భద్రత ఏర్పాట్లు, లిమిటెడ్ థియేటర్లలో ప్రదర్శనల ద్వారా ఈసారి ఇబ్బందులను నివారించే అవకాశం ఉంది. “గేమ్ ఛేంజర్” కోసం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉండగా, ఈ సినిమా బెనిఫిట్ షోలు కూడా మంచి ఓపెనింగ్స్ కు దోహదం చేసే అవకాశం ఉంది. ఫైనల్ గా, సంక్రాంతి బరిలో “గేమ్ ఛేంజర్” బాక్సాఫీస్ వద్ద ఎంత మేర విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాల్సిందే.