సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు లేదంటే వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. కొందరు అనారోగ్య సమస్యలతో, ఇంకొందరు వయసు సంబంధిత సమస్యలతో.. లేదంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే వస్తున్నాం. రెండు రోజుల క్రితం స్టార్ హీరో మమ్ముట్టి సోదరి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ షాకింగ్ న్యూస్ నుండి ఇంకా సినీ పరిశ్రమ కోలుకోకుండానే మరో నిర్మాత కన్నుమూసినట్టు సమాచారం.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శ్రీ గోగినేని ప్రసాద్ నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మరణించారు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం’ వంటి మంచి చిత్రాలతో పాటు నందమూరి బాలకృష్ణతో ‘పల్నాటి పులి’ వంటి పెద్ద సినిమాలను కూడా నిర్మించారు. గోగినేని ప్రసాద్ గారికి ఓ కుమారుడు ఉన్నాడు. అతను అమెరికాలో స్థిరపడ్డాడు.
ఇక సెప్టెంబర్ 14 న మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గోగినేని ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. వీరి అంత్యక్రియలకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక గోగినేని ప్రసాద్ వయస్సు 73 సంవత్సరాలు కావడంతో వయసు సంబంధిత సమస్యలతోనే ఆయన మరణించినట్లు స్పష్టమవుతుంది. హైదరాబాదులోని కొండాపూర్ లో ఉన్న ఆయన నివాసమందు ఆయన మరణించినట్లు తెలుస్తుంది.