సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు.. ఓటీటీలోకి వస్తున్నప్పుడు ఆ సినిమా నిర్మాతలు చెప్పే విషయాలు.. ఆ సినిమా వచ్చి కొన్నేళ్లు అయిన తర్వాత చెప్పే మాటలు ఒకేలా ఉండటం లేదు. ముఖ్యంగా వసూళ్ల విషయంలో, ఫలితం విషయంలో ఈ డబుల్ టంగ్ వినిపిస్తోంది. తాజాగా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా ఫలితం విషయంలో ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ (Suryadevara Naga Vamsi) రియాక్ట్ అయ్యారు. ఎందుకు సినిమాకు అలాంటి ఫలితం వచ్చిందో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.
మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో తెరకెక్కి.. ఈ సంక్రాంతికి వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. సినిమాకు భారీ విజయం దక్కింది అని అప్పుడు సినిమా టీమ్ చెప్పింది. అయితే వసూళ్ల విషయంలో చాలా రకాల వార్తలు, విమర్శలు వచ్చాయి కూడా. ఇప్పుడు నాగవంశీ చెబుతున్న మాటలు వింటుంటే అప్పుడు వచ్చిన విమర్శలే నిజమా అనిపిస్తోంది. సినిమాకు ఆశించినంత ఫలితం రాకపోవడానికి, వసూళ్లు రాకపోవడానికి సినిమా టైటిలే అని ఆయన అంటున్నారు.
‘గుంటూరు కారం’ సినిమా ఫలితం విషయంలో, సినిమా విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. అంచనాలకు తగ్గట్లుగా సినిమా లేదని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. తాజాగా కారణం ఇదే అంటూ.. నాగవంశీ రియాక్ట్ అయ్యారు. ‘గుంటూరు కారం’ సినిమా పూర్తిగా కుటుంబ కథా చిత్రమని.. టైటిల్ చూస్తే మాస్ సినిమా అనిపించడమే సినిమాకు కుటుంబ అభిమానులు దూరమయ్యారు అని నాగవంశీ చెప్పకనే చెప్పారు.
కంటెంట్ పరంగా ‘గుంటూరు కారం’ సినిమాలో ఎలాంటి తప్పు లేదని, మహేష్ బాబు, రమ్యకృష్ణ (Ramya Krishnan) మధ్య సెంటిమెంట్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. సినిమా జోనర్ విషయంలో ఉన్నదొకటి, బయటకు చెప్పిందొకటి అవ్వడంతో ఆశించిన ఫలితం రాలేదు అని ఆయన అంటున్నారు. నైజాం ఏరియాలోనే సినిమా బిజినెస్‌కు, వసూళ్లకు బాగా డ్యామేజీ జరిగిందని నాగవంశీ చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో సినిమా వల్ల తాము సేఫ్‌గా ఉన్నామని అన్నారు.