కాన్సెప్ట్ సినిమాలతో కథానాయకుడిగా మంచి ఫామ్ లో ఉన్న సుహాస్ (Suhas) నటించిన తాజా చిత్రం “జనక అయితే గనక” (Janaka Aithe Ganaka) . “సలార్” చిత్రంతో మాటల రచయితగా విశేషమైన పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dil Raju) సారథ్యంలో ఆయన కుమార్తె హన్షిత రెడ్డి (Hanshitha Reddy) నిర్మించడం విశేషం. తాను తండ్రైనందుకు కండోమ్ కంపెనీ మీద కేస్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల అక్టోబర్ 12న అయినప్పటికీ.. సినిమా మీద నమ్మకంతో అక్టోబర్ 9 నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మరి చిత్రబృందం నమ్మకం ఏమేరకు వర్కవుట్ అయ్యిందో చూద్దాం..!!
కథ: ప్రసాద్ (సుహాస్) ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చెప్పిన స్థలం కొనకుండా భవిష్యత్ వృధా చేశాడని తండ్రి మీద కోపం, ఉన్నదాంతో సర్దుకుని తనను అర్థం చేసుకొనే భార్య అంటే ప్రేమ, నెలకి కటింగ్స్ పోనూ 23,634/- రూపాయల జీతం ఇచ్చే బాస్ మీద చిరాకుతో చాలా సాధారణంగా బ్రతికేస్తుంటాడు. తన తండ్రి తనకు ఇవ్వలేకపోయిన మంచి భవిష్యత్, తన పిల్లలకు ఇవ్వాలని కలలు కంటుంటాడు. అయితే.. తన పిల్లలకు బెస్ట్ ఇవ్వలేని స్థాయిలో ఉన్నందున అసలు పిల్లలే వద్దు అనుకుంటాడు.
కట్ చేస్తే.. నెల తప్పానని చెప్పిన భార్య మాట విని షాకై, దీనికి ఎంజాయ్ కంపెనీ తయారు చేయగా తాను వాడిన కండోమ్స్ సరిగా పనిచేయకపోవడమే కారణం అని కన్స్యూమర్ కోర్ట్ లో కేస్ వేస్తాడు ప్రసాద్. ఆ కంపెనీ ప్రసాద్ పెట్టిన కేస్ విషయంలో ఎలా రెస్పాండ్ అయ్యింది? ఈ కేసు విషయంలో ప్రసాద్ ఎదుర్కొన్న సమస్యలేమిటి? వాటిని ఎలా జయించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “జనక అయితే గనక” (Janaka Aithe Ganaka) చిత్రం.
నటీనటుల పనితీరు: బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ లో సుహాస్ జీవించేస్తాడు. ఈ సినిమాలోనూ అదే తరహాలో ప్రసాద్ అనే పాత్రలో జీవించేశాడు. అయితే.. మునుపటి సినిమాల తరహాలోనే నటనలో వేరియేషన్స్ చూపించడం లేదు. ఆ ఒక్క మైనస్ పాయింట్ ను అధిగమించగలిగితే నటుడిగా మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తి సుహాస్. హీరోయిన్ సంగీర్తన విపిన్ ఓ సగటు భార్య పాత్రలో ఒదిగిపోయింది.
వెన్నెల కిషోర్ (Vennela Kishore) కామెడీ టైమింగ్ మరోసారి భీభత్సంగా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో కిషోర్ చెప్పే భారీ డైలాగ్ భలే పేలింది. గోపరాజు రమణ పాత్రకు ప్రతి సగటు మధ్యతరగతి తండ్రి కనెక్ట్ అవుతాడు. ప్రభాస్ శ్రీను, మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: విజయ్ బుల్గానిన్ “జనక అయితే గనక” (Janaka Aithe Ganaka) సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. వినసొంపైన పాటలు, ఆకట్టుకునే నేపథ్య సంగీతంతో సినిమాకి మెయిన్ పిల్లర్ లా నిలిచాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ వర్క్ చిన్న సినిమాను కూడా పెద్ద సినిమాలా ఎలివేట్ చేసింది. టెక్నికల్ గా సినిమా విషయంలో వేలెత్తి చూపే స్థాయిలో ఏమీ లేదు. దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల ఒక మంచి పాయింట్ ను మూలకథగా ఎంచుకున్న తీరు, అందులో ఆలోచింపజేసే ఓ కోణాన్ని నిర్లిప్తంగా ఎలివేట్ చేసిన విధానం బాగుంది.
ప్రస్తుత విద్యా వ్యవస్థ, వాటి ఫీజులు, చిన్న పిల్లల పేరు మీద తల్లిదండ్రులను కార్పొరేట్ సంస్థలు ఎలా దోచుకుంటున్నాయి అనే అంశాన్ని ప్రశ్నించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. అయితే.. ప్రెజంటేషన్ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. భార్య పాత్ర కోర్టుకు రావడానికి అత్త పాత్ర ఇచ్చే జస్టిఫికేషన్ ఎబ్బెట్టుగా ఉండగా, కోర్టు ప్రొసీడింగ్స్ విషయంలో సినిమాటిక్ లిబర్టీస్ మరీ ఎక్కువగా తీసుకొని, మరీ హాస్యాస్పదంగా సాగడం మరో మైనస్. ఓవరాల్ గా దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు సందీప్ రెడ్డి బండ్ల.
విశ్లేషణ: సమాజంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నిస్తున్నప్పుడు చిన్నపాటి నిజాయితీ చాలా అవసరం. అలాగే.. ఆ ప్రశ్నించే తీరు కూడా. ఈ రెండు విషయాల్లో కాస్తంత జాగ్రత్త తీసుకొని ఉంటే “జనక అయితే గనక” (Janaka Aithe Ganaka) సూపర్ హిట్ అయ్యేది. ఆ కీలకాంశాలు లోపించడంతో యావరేజ్ గా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: ఓ మిడిల్ క్లాస్ తండ్రి సమాజంపై విసిరిన వ్యంగ్యాస్త్రం కాస్త గురి తప్పింది!
రేటింగ్: 2.5/5