అసలు తెలుగు సినిమాలకి టికెట్ హైక్ లు అవసరమా అని హీరోల అభిమానులు సైతం గొంతు చించుకుంటూ ఉంటే.. ఈమధ్య డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ హైక్ అనేది రెగ్యులర్ సినిమా గోయర్స్ అని ఇబ్బందిపెడుతున్న విషయం. మొన్నామధ్య “వార్ 2, కూలి” సినిమాలకు కూడా టికెట్ హైక్ పర్మిషన్ ఇచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే.. సోషల్ మీడియా మొత్తం ఉమ్మెత్తిపోసింది.. డబ్బింగ్ సినిమాలకు తెలుగులో హైక్ ఇవ్వడం ఏంటి అని.
దాంతో సదరు జీవోలను క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మళ్లీ “కాంతార చాప్టర్ 1” విషయంలో అదే ఫార్మాట్ ను ఫాలో అవుతుంది మైత్రీ సంస్థ. వరల్డ్ వైడ్ గా “కాంతార” బుకింగ్స్ ఓపెన్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో హైక్ కోసం వెయిట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా బడ్జెట్ ఎంత, ఎన్ని రోజులు తీశారు అనే విషయం పక్కన పెడితే.. ఒక డబ్బింగ్ సినిమాకి టికెట్ హైక్ ఇవ్వడం అనేది కామెడీ అయిపోతుంది.
ఇది కేవలం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తెలుగు సినిమా అభిమానులను, ప్రేక్షకులను లూటీ చేయడమే. ఈ హైక్ వల్ల థియేటర్లకి వచ్చే జనాలు కూడా రావడం మానేశారు. అసలు పెద్ద సినిమాలకు కూడా హైక్ లు అవసరం లేదు. సినిమా బాగుంటే జనాలు క్యూలు కడతారు. కానీ.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అత్యాశకి పోయి సినిమాని చంపేస్తున్నారు.
రెండుమూడ్రోజుల అదనపు ఆదాయం కోసం ఇలా సినిమా లాంగ్ రన్ ను చంపేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పుడు డబ్బింగ్ సినిమాల హైక్ లకు ఖండిస్తున్న సినిమా అభిమానులు, స్ట్రయిట్ సినిమాల హైక్ లను వ్యతిరేకించే రోజులు ఎంతో దూరంలో లేవు. మరి ఈ విషయంలో అగ్ర నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం!