మాహిష్మతి సామ్రాజ్యంలోని ఆత్మీయతలు, అనురాగాలు, పోరాటాలు, ప్రేమలు, కుట్రలు, కుతంత్రాలను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అద్భుతంగా కళ్లకు కట్టారు. మనదేశంలో నిజంగా మాహిష్మతి రాజ్యం ఉండేదని ప్రతి ఒక్కరూ భావించేలా చేశారు. ఇక ప్రభాస్ అయితే తెలుగు రారాజు రూపం, పౌరుషం ఎలా ఉండేదో ఆవిష్కరించారు. ఆ కథకి, అందులోని నటీనటుల నటనా ప్రతిభకి ప్రపంచ సినీ ప్రియులు దాసోహం అన్నారు. కలక్షన్ల వర్షం కురిపించారు. ఆ వర్షం ఇప్పటికీ చైనాలో కురుస్తోంది. రెండు రోజుల క్రితం బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రానికి మూడో పార్ట్ తీయాలని జక్కన్నని ఎంతోమంది కోరినప్పటికీ మౌనమే సమాధానముగా చెప్పారు.
నిర్మాతలు అతనికి విలువిచ్చి మూడో పార్ట్ తీయకుండా.. ప్రీక్వెల్ తీయడానికి సిద్ధమయ్యారు. అంటే అమరేంద్ర బాహుబలి తండ్రి పాలనలో మాహిష్మతి రాజ్యం ఎలా ఉండేదో చూపించనున్నారు. అందుకోసం కథని సిద్ధం చేస్తున్నారు. బాహుబలి కథని అందించిన విజయేంద్ర ప్రసాద్ పర్వవేక్షణలో కథ రెడీ అవుతోందని నిర్మాత ప్రసాద్ వెల్లడించారు. ఇక ఇందుకోసం కూడా భారీ సెట్స్.. భారీ ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ చిత్రాన్ని కూడా బాహుబలి స్థాయిలోనే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మూడేళ్ల పాటు నిర్మించనున్నట్లు సమాచారం. ఇతర ప్రాజెక్ట్స్ సైన్ చేయడంతో ఇందులో హీరోగా ప్రభాస్ నటించడం కుదరదని టాక్. దర్శకత్వం రాజమౌళి చేస్తారా? లేక వేరే వాళ్ళు చేస్తారా? అనేది చర్చల్లో ఉంది. ఈ ప్రాజక్ట్ గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియనుంది.