నిర్మాతల ప్లాన్.. ‘అమెజాన్’ అంగీకరిస్తుందా..?

గతంలో ఓ సినిమా హిట్టయినా ప్లాప్ టాక్ వచ్చినా… అయినా ఓ వారం రోజులు డీసెంట్ కలెక్షన్లు వచ్చేవి. అయితే ‘టీవీ’ ల్లోనూ… యూట్యూబ్ లోనూ సినిమా విడుదలైన రెండు నెలలకే ‘హెచ్.డి ప్రింట్’ లను పెట్టేస్తుండడంతో… విడుదలైన్ సినిమాకి ప్లాప్ టాక్ వస్తే వీకెండ్ తరువాత కలెక్షన్లు రావడం మందగించాయి. అయితే ఇప్పటి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ఒక సినిమాకి ప్లాప్ టాక్ వచ్చిందంటే చాలు.. నెల రోజుల లోపే ‘అమెజాన్’ ప్రైమ్ కి వచ్చేస్తుందని ప్రేక్షకులకి కూడా తెలిసిపోయింది. మొదటి రోజు సినిమా చూసిన వాళ్ళు… సినిమా చూడని వాళ్ళకి… టైటిల్స్ స్టార్టింగ్ లో ‘అమెజాన్ ప్రైమ్ ‘ యాడ్ చూసి.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది అని ప్రచారం చేసేస్తున్నారు. దీంతో చాలా వరకూ ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్ కి రాని పరిస్థితి ఏర్పడింది. ఒక్క రజినీ కాంత్ ‘పేట’ మినహా… గత నెల సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ నెల తిరుగకుండానే ‘అమెజాన్ ప్రైమ్’ కి వచ్చేసాయి.

ఇక అమెజాన్ సంస్థ వారు కూడా కోట్లు పెట్టి ఈ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. దీంతో నిర్మాతలకు బిజినెస్ బాగానే జరుగుతున్నప్పటికీ… చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. విడుదలైన చిత్రాలకి ప్లాప్ టాక్ వస్తే.. కనీసం వీకెండ్ వరకూ కూడా థియేటర్లు ఫుల్స్ పడట్లేదు. దీంతో వీకెండ్ కి కూడా మంచి కలెక్షన్లు రాని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల విడుదలైన ‘మహానాయకుడు’ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ చిత్రం వీకెండ్ కి కూడా డీసెంట్ కలెక్షన్లను రాబట్టలేక పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. పోనీ అమెజాన్ వారు చిత్రాన్ని కొన్ని రోజులు లేటుగా విడుదల చేయడానికి అస్సలు రాజీ పడరు.

ఈ క్రమంలో నిర్మాతలు అమెజాన్ సంస్థకి ఓ రిక్వెస్ట్ చేయడానికి సిద్దమవుతున్నారట. విషయంలోకి వెళితే .. సినిమాను అమెజాన్ కి అమ్ముతారు.. అందులో డౌట్ లేదు. అమ్మిన సినిమాని ముప్పై రోజుల్లోనే ప్రైమ్ లో కూడా పెట్టుకోవచ్చు… అయితే సినిమా టైటిల్స్ మొదలయ్యేటప్పుడు మాత్రం ‘డిజిటల్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్’ అని టైటిల్స్ కి ముందు వేయకుండా ఉండాలని నిర్మాతలు… అమెజాన్ వారికి రిక్వెస్ట్ పెట్టబోతున్నారట. ఇలా చేస్తే సినిమా అమెజాన్ కి వస్తుందా..? రాదా..? అనే డౌట్ తో అయినా జనాలు సినిమాకి వచ్చే అవకాశాలు ఉంటాయని నిర్మాతలు ఆలోచన కలిగి ఉన్నారట. మరి వీరి ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus