సినిమా పరిశ్రమలో మహిళకు ప్రాధాన్యమివ్వాలి, మహిళల రాక పెరగాలి అంటూ పెద్ద ఎత్తున లెక్చర్లు ఇస్తుంటారు మన టాలీవుడ్‌లో. ఆ మాటకొస్తే అలా వచ్చినవాళ్లు ఎంతవరకు రాణిస్తున్నారు అనేదే ప్రశ్న. హీరోయిన్లు, ఫీమేల్ యాక్టర్లు తప్ప మిగిలిన విభాగాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎన్నో కష్టాలు పడి ముందుకొచ్చినవాళ్లకు.. అందులోనూ దర్శకత్వ శాఖలో ముందుకొచ్చినవాళ్లకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ‘మార్టిన్ లూథర్ కింగ్’ దర్శకురాలు పూజ కొల్లూరును అడిగితే చెబుతారు.
రాజకీయాలు… ఎన్నికల నేపథ్యంలో సాగే సినిమాలు మనకు కొత్తేం కాదు. ఇప్పటికే మనం చాలా సినిమాలు చూశాం. అయితే ఇప్పటిదాకా వచ్చిన అలాంటి సినిమాలు రాజకీయ నాయకుల కోణాన్ని ఆవిష్కరించినవే. అసలు ఓటు ఎందుకు వేయాలి అని ఓ ఓటరు ప్రశ్నించే యాంగిల్‌లో తెరకెక్కిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమాను పూజ కొల్లూరు తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 27న వస్తున్న సందర్భంగా… ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పరిశ్రమలో తన తొలి నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సినిమాకు ముందు (Puja Kolluru) పూజ… తన సొంత కథల్ని నిర్మాతలకి వినిపించారట. అయితే ‘ఇది మరో ఐదేళ్ల తర్వాత తీయాల్సిన సినిమా’ అని కొంతమంది అన్నారట. మరికొంతమంది అయితే ‘అమ్మాయివి కదమ్మా, రొమాంటిక్ ప్రేమకథ చెప్పొచ్చు కదా’ అనేవారట. నిజానికి వాళ్లు అలా అనడంతో తప్పు లేదు కానీ, విభిన్నమైన చిత్రాలు తీసి నా ప్రత్యేకతని చాటుకోవాలనేది ఆశ అని చెప్పారు పూజ.
దివంగత దర్శకురాలు, నటి అయిన విజయనిర్మల తరహాలో వైవిధ్యమైన సినిమాలు తీసి మెప్పించాలనేది నా ఆలోచన అని పూజ చెప్పారు. నేటి తరం యువతలా మార్వెల్ సినిమాలు చూస్తూ పెరిగానని, థ్రిల్లర్ సినిమాలు, యాక్షన్ సినిమాలంటే ఇష్టమని చెప్పిన పూజ… అలాంటి సినిమాలు తీసే అవకాశమే రావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పారు. అయినా తనకు ఎదురైన అనుభవాలు ఏ పరిశ్రమలోనైనా సాధారణమే అని ముందుకు సాగుతున్నాను అని చెప్పారు.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!