రాజమౌళి (Rajamouli) తండ్రి, స్టార్ రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి తన కొడుకు రాజమౌళి కంటే కూడా దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) అంటే ఎక్కువ అభిమానం. ఆయన ఫోన్లో కూడా పూరీ ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకున్నట్టు ఓ సందర్భంలో రివీల్ చేశారు. అయితే ‘లైగర్’ (Liger) రిలీజ్ తర్వాత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) పూరీకి ఫోన్ ఓ చేసి ఓ హెల్ప్ అడిగారట. అదేంటో పూరీ మాటల్లో.. తెలుసుకుందాం. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. “ఒక హిట్టు సినిమా తీసినప్పుడు చాలా మంది ఫోన్ చేస్తారు, ప్రశంసిస్తారు..! నా గత సినిమా ప్లాప్ అయ్యింది.
అప్పుడు నాకు ఒకాయన ఫోన్ చేశారు. ఆయన మరెవరో కాదు విజయేంద్ర ప్రసాద్ గారు. సాధారణంగా ఆయన నాకు ఫోన్ చెయ్యరు. కానీ ఆయన దగ్గర్నుంచి ఫోన్ వస్తుందేంటి అని కంగారు పడి ఫోన్ లిఫ్ట్ చేశాను. ఆయన నాకు ఫోన్ చేసి..’సార్..! నాకు ఓ హెల్ప్ చేస్తారా?’ అని అడిగారు.అదేంటి ‘ఆయన కొడుకే ఓ పెద్ద డైరెక్టర్ రాజమౌళి. నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలిరా బాబు’ అని మనసులో అనుకున్నాను.
ఆ తర్వాత ఆయన ‘మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు?’ అని అడిగారు. దానికి నేను ‘ఇంకా అనుకోలేదు సార్’ అని చెప్పాను. దానికి ఆయన ‘మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేసినా సరే.. ముందుగా నాకు కథ చెబుతారా? మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అయితే నేను చూడలేను. కాబట్టి..నాకు కథ ముందుగా చెప్పండి’ అని అన్నారు.
నా పై ప్రేమతో ఆయన చేసిన ఫోన్ కాల్ అది. థాంక్యూ సార్. అయినా సరే నేను ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) కథ ఆయనకు చెప్పలేదు. తెలిసిన పనే కథా.. కాస్త ‘ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేద్దాం’ అని భావించి ఈ సినిమా చేశాను. ఇది రిలీజ్ అయ్యాక నేను ఆయన్ని కలుస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.