ఎప్పటికైనా “జనగణమన” సినిమా తీస్తాను : పూరి జగన్నాథ్

డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సినీ పరిశ్రమలో రాకెట్ లా దూసుకొచ్చారు. బద్రి, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, పోకిరి ఇలా వరుసగా విజయాలను అందుకొని స్టార్ డైరక్టర్ అయిపోయారు. ఆ తర్వాత పూరిపై అంచనాలు పెరిగిపోవడంతో బిజినెస్ మ్యాన్, టెంపర్ తప్ప ఆయన దర్శకత్వంలో  చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. తాజాగా తన కొడుకు ఆకాష్ ని హీరోగా రీ లాంచ్ చేస్తున్నారు. సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో తనకి సొంతమైన స్టైల్లో ప్రేమకథను తెరకెక్కించారు. భారత్‌ పాక్‌ల యుద్ధ నేపథ్యంలో సాగే కథతో మెహబూబా సినిమాను రూపొందించారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం  మే 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన పూరి జగన్నాధ్ మెహబూబా సినిమా విశేషాలతో పాటు మహేష్ బాబుతో  చేయాలనుకున్న “జనగణమన” ప్రాజెక్ట్ గురించి కూడా తెలిపారు. పోకిరి, బిజినెస్ మ్యాన్ తర్వాత మహేష్ తో హ్యాట్రిక్ కొట్టాలని  “జనగణమన”కథ రాసుకున్నారు. మహేష్ కి కూడా వినిపించారు. అయితే మహేష్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి కనబరచలేదు.

అతని డేట్స్ కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి పూరి మాట్లాడుతూ.. ‘‘ అసిఫా వంటి అమ్మాయిల గురించి విన్నప్పుడు అందరిలాగే నేను కూడా చాలా బాధ పడ్డాను. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అసలు ఈ దేశం ఎటుపోతుందో అర్ధం కావడం లేదనిపిస్తుంది. దేశం ఎలా ఉంటే బాగుంటుంది. అందుకు ఏం చేయాలి అనేదే ‘జనగణమన’ స్టోరీలైన్. ఈ కథ ఇప్పుడు సమాజానికి చాలా అవసరం. ఈ కథని మహేష్ బాబు చేయకపోయినా, మరో హీరోతోనైనా సరే తీస్తాను. ఎప్పటికైనా సరే “జనగణమన” సినిమా తీసి తీరుతాను’’ అంటూ పూరి వివరించారు. మహేష్ బాబు అయితే భరత్ అనే నేను సినిమా విజయ ఉత్సాహంతో మూడు సినిమాలను లైన్లో పెట్టారు. వంశీ పైడిపల్లి, సందీప్ వంగా, సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. మరి మహేష్ కాకుండా పూరి ఈ కథని ఎవరుతో చేస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus