సమాజాన్ని పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తన సినిమాల్లో చూపించే విధానం చాలా కొత్తగా ఉంటుంది. ఇలా కూడా ఆలోచిస్తారా, ఇలా కూడా ఉంటారా అనేలా ఆయన పాత్రలు, సినిమాలు ఉంటాయి. అయితే ఆయన ఆలోచనలు కేవలం సినిమాలకే కాకుండా… మ్యూజింగ్స్ పేరుతో తన ఆలోచనల్ని వివరిస్తున్నారు పూరి. కరోనా – లాక్‌డౌన్ సమయంలో ఓ యూట్యూబ్ ఛానల్‌ను, పాడ్‌కాస్ట్‌లను ప్రారంభించి ఆసక్తికర విషయాలు చెప్పడం ప్రారంభించారు. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన… కొత్త మ్యూజింగ్ లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు.
పూరి తన కొత్త మ్యూజింగ్‌లో పెన్సిల్వేనియాలో నివసించే అమిష్ పీపుల్ గురించి వివరించారు. ప్రపంచంలో చాలామందికి వారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటూ వాళ్ల లైఫ్ స్టైల్ గురించి క్లియర్‌గా వివరించారు. అమిష్ పీపుల్ ఇప్పటికీ కరెంట్ వాడరని… అందుకే వారి ఇళ్లలో ఏసీ, ఫ్రిజ్, గ్రైండర్లు లాంటివి ఉండవు అని చెప్పారు. ఇక స్మార్ట్ ఫోన్‌లు, టీవీల ఊసే ఉండదని, కార్లు అసలే వాడరని వాళ్ల లైఫ్ స్టైల్ గురించి తెలిపారు. క్లియర్‌గా చెప్పాలంటే 18వ శతాబ్దంలో ఎలా బతికేవారో ఇప్పటికీ వారు అలానే ఉన్నారట.
ఇక వారు పిల్లలను ఎక్కువగా చదివించరని,. ఉమ్మడి కుటుంబాలను ఇష్టపడతారని, ఆదివారం అందరూ విశ్రాంతి తీసుకుంటారని, ప్రపంచంలోని మిగతా జనాభాతో కలిసిపోయేందుకు ఆసక్తి చూపించరని తెలిపారు. ఇక వాళ్ల గురించి ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరట. వాళ్ల జీవనశైలిని వీడియో తీయడానికి కూడా అంగీకరించరట. అలాగే ఆడవాళ్లు మేకప్‌లు వేసుకోరని, పొగడ్తలను ఇష్టపడరని… అంతలా అందరూ క్రమశిక్షణతో ఉంటారని చెప్పారు పూరి.
ఇక వాళ్లలో ఎవరికైనా ఆపద వస్తే అందరూ సాయం చేస్తారని, అంతలా బంధాలకు విలువిస్తారు. ప్రకృతిని గౌరవిస్తారని తెలిపిన పూరి… వాళ్ల మత గ్రంథంలో చెప్పినట్లే జీవిస్తారని చెప్పారు. ప్రపంచమంతా మారుతున్నా.. వాళ్లు మాత్రం 300 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అలానే ఉంటున్నారని చెప్పారు. వాళ్లకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని బతుకుతున్నారు. ప్రకృతికి నష్టం వాటిల్లే పనులేవీ చేయరు.
ఇక సోషల్‌మీడియా వాళ్లకు తెలియదు. అందుకే సంతోషంగా ఉన్నారు. ప్రతీ సాయంత్రం అందరూ కలిసి సరదాగా గడుపుతారు. ఇంకా చెప్పాలంటే వాళ్లు చేస్తున్నది వంద శాతం సరైన పని. అంతేకాదు వాళ్ల మీద హాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయని, వీలైతే ఒకసారి చూడండి అని పూరి సూచించారు.