ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 (Pushpa 2) సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసినా, టెలివిజన్ రేటింగ్స్ విషయంలో మాత్రం ఆశించిన స్థాయికి చేరలేదు. పాన్ ఇండియా స్థాయిలో దాదాపు రూ.1800 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా మొదటి సారి టీవీలో ప్రసారమైనప్పుడు కేవలం 12.61 టీఆర్పీ మాత్రమే రాబట్టింది. ఈ ఫలితంతో అభిమానుల్లో మిక్స్‌డ్ ఫీలింగ్ నెలకొంది. బన్నీ గత సినిమాల టీఆర్పీ లెక్కలు చూస్తే ఈ రేటింగ్ చాలా తక్కువ.
‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramul00) మొదటి ప్రసారంలో 29.4 టీఆర్పీ, ‘పుష్ప: ది రైజ్’(Pushpa) 22.54 టీఆర్పీ, ‘డీజే’ (Duvvada Jagannadham) 21.7 టీఆర్పీ లాగా మంచి రేటింగ్స్ రాబట్టాయి. కానీ ‘నా పేరు సూర్య’ (Naa Peru Surya Naa Illu India) లాంటి ఫ్లాప్ సినిమాకు 12 టీఆర్పీ వచ్చిందన్న లెక్కలోకి చూస్తే, ‘పుష్ప 2’ అదే స్థాయిలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ తక్కువ రేటింగ్‌కి ప్రధాన కారణం ఓటీటీ వ్యూయర్‌షిప్ అని విశ్లేషకులు చెబుతున్నారు.
థియేటర్‌లో విడుదలైన తర్వాత, ఓటీటీలో భారీగా వ్యూస్ రాబట్టిన ఈ సినిమా టీవీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయినట్లు కనిపిస్తోంది. పైగా, సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో మధ్యలో వీక్షణ విరమించినవారే ఎక్కువగా ఉన్నట్లు టీవీ వర్గాల అంచనా. అల్లు అర్జున్ సినిమాలకు టీవీలో స్థిరమైన ఫాలోయింగ్ ఉన్నా, ఈసారి పుష్ప 2 మాత్రం అందులో మినహాయింపుగా మారింది.
ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషనల్ కనెక్ట్ ఉండే చిత్రాలకు సాధారణంగా ఎక్కువ టీఆర్పీ వచ్చే ఛాన్స్ ఉండగా, పుష్ప 2 లాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఓటీటీపై మోజు ఎక్కువగా పనిచేసినట్లు భావించాలి. మొత్తానికి, పుష్ప 2 టీఆర్పీ పరంగా నిరాశపరిచినా, థియేటర్ కలెక్షన్లు, ఓటీటీ రికార్డులతో సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. ఇది తాజా ట్రెండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. టీవీ రేటింగ్ కంటే థియేటర్ + ఓటీటీ ఫలితాలు కే డిమాండ్ ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో టీఆర్పీ లెక్కలు పాతబడి, డిజిటల్ మానిటరింగ్ ప్రధానంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.