భరత్ అనే నేను సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అత్యధిక కలక్షన్స్ సాధించింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో నెక్స్ట్ సినిమాని మహేష్ తొందరగా పట్టాలెక్కిస్తారని అందరూ అనుకున్నారు. డైరక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నిటినీ పూర్తిచేశారు. అయినా ఈ చిత్ర షూటింగ్ మొదలుకాలేదు. ఇందుకు కారణం నిర్మాత పీవీపీ అని ఫిలిం నగరవాసులు చెబుతున్నారు. గతంలో మహేష్ బాబు పొట్లూరి ప్రసాద్ నిర్మాణంలో బ్రహ్మోత్సవం సినిమా చేశారు. ఆ సినిమా సమయంలోనే మరో రెండు చిత్రాలను పీవీపీ సినిమా బ్యానర్లో చేస్తానని మహేష్ మాట ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బ్రహ్మోత్సవం పరాజయం పాలయింది. పెట్టిన ఖర్చులు కూడా రాలేదు.
దీంతో మహేష్ బాగా అప్ సెట్ అయ్యారు. మరోసారి పీవీపీ సినిమా బ్యానర్లో సినిమా చేయడానికి ఆసక్తికనబరచలేదు. పొట్లూరి ప్రసాద్ మంచి కథలను తీసుకొస్తున్నప్పటికీ ఏదో కారణం చెప్పి పక్కన పెడుతూ వచ్చారు. అయితే వంశీ పైడిపల్లి చెప్పిన కథకి కనెక్ట్ అయ్యారు. అతన్ని పీవీపీ తీసుకొచ్చినప్పటికీ.. అతని బ్యానర్లో కాకుండా దిల్ రాజు, అశ్వినీదత్ బ్యానర్లో ఆ కథని చేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై పీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ సాగుతోంది. పీవీపీ తో రాజీ చేయించుకోవడానికి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ ఒప్పుకోలేదు. ఈ కేసుపై రేపు తుది తీర్పు వెలువడనుంది. సో ఈ కేసు ముగిసిన తర్వాత కొత్త సినిమాని మొదలుపెట్టాలని మహేష్ అనుకుంటున్నారు. మరి పీవీపీ తో సినిమా చేయడానికి మహేష్ ఒకే చెబుతారా? లేదా నష్టపరిహారం చెల్లిస్తారా? అనేది కొన్ని గంటల్లో తేలనుంది.