పాకిస్థానీ సబ్ మెరైన్ మన భారత సరిహద్దులను దాటి విశాఖపట్నం పోర్ట్ లో ఉన్న భారతీయ నౌకాదళానికి మచ్చుతునక లాంటి “ఐ.ఎన్.ఎస్.విక్రాంత్”ను పేల్చివేయడానికి చేసిన ప్రయత్నాన్ని భారతీయ నౌకాదళం గట్టిగానే తిప్పికొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే “ఘాజీ”. రాణా కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలవడంతోపాటు నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకొంది. ఇదంతా మనకు చరిత్ర చెప్పిన కథ. అయితే.. పాకిస్తాన్ నుంచి మనకి అసలు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? అందుకు తోడ్పడింది ఎవరు అనే విషయం మాత్రం “ఘాజీ”లో ఎక్కడా చూపించలేదు.
అయితే.. క్రిందటివారం విడుదలైన “రాజీ”తో “ఘాజీ” వెనుక అసలు కథ ఏమిటి అనే విషయాన్ని అత్యద్భుతమగా చూపించారు. ఆలియా భట్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రానికి మేఘన గుల్జార్ దర్శకత్వం వహించగా.. మొదటివారమే 30 కోట్లకు పైగా వసూలు చేసి ఆలియా భట్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో నటిగా ఆలియా భట్ ఒక పదిమెట్లు ఎక్కగా.. “రాజీ” ఈ ఏడాది బాలీవుడ్ లో విడుదలైన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం విశేషం.