బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు. ప్రతిదీ పక్కాగా ఉండాలి. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో లో ఒక్క ఫైట్ కోసం 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సన్నివేశంలో ఎన్నో కాస్ట్లీ కార్లను నుజ్జు నుజ్జు చేశారు. ఇప్పుడు ప్రభాస్ 20 వ చిత్రానికి కూడా కార్ల అవసరం వచ్చింది. ఎంత డబ్బులు ఇవ్వడానికి అయినా నిర్మాతలు రెడీగా ఆన్నారు. అయితే ఆ కార్లు దొరకడమే కష్టంగా ఉంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్, పూజ హెగ్డేలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఇది 1970 నాటి కథతో తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే అక్కడి బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ కార్లు, బస్సులు మాత్రం అప్డేట్ అయిపోయి ఉన్నాయి. ఇదే చిత్ర బృందానికి ఇబ్బందిగా మారింది. అందుకే అప్పటి కార్లు, బస్సులు సేకరించే పనిలో చిత్ర యూనిట్ పడింది. అవి దొరికిన వెంటనే రోడ్లపై ఉండే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ ప్రేమకథ కోసం హైదరాబాద్ లో ఏడుకోట్లతో భారీ సెట్ వేస్తున్నారు. ఆ నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టనున్నారు. ఇటలీ తర్వాత ఇక్కడే షెడ్యూల్ మొదలుకానుంది.