Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

సివ‌రాప‌ల్లి స‌క్సెస్ త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్రల‌ను ఎంచుకుంటూ ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోతూ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు రాగ్ మ‌యూర్‌. రీసెంట్‌గా స‌మంత నిర్మాణంలో ప్ర‌వీణ్ కండ్రేగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శుభం సినిమాలో రాగ్ మ‌యూర్ పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. దీని గురించి ఆయ‌న మాట్లాడుతూ ‘‘నేను ఇంత‌కు ముందు చేసిన సినిమా బండి సినిమా ఎంత మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మ‌రిడేష్ బాబు పాత్ర‌కు కొన‌సాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ చాలా స‌ర‌దాగా డిజైన్ చేశారు. ఆయ‌న క‌థ నెరేట్ చేసిన త‌ర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని అర్థమైంది. అందుక‌నే శుభం సినిమా చేయ‌టానికి నేను కాద‌న‌లేక‌పోయాను. నా న‌మ్మ‌కం నిజ‌మైంది. నా పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన స‌మంత‌గారికి, ప్ర‌వీణ్‌గారికి థాంక్స్‌. సినిమా చాలా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకోవటం సంతోషంగా ఉంది’’ అన్నారు.

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్నమూడో చిత్రం ‘పరదా’లో రాగ్ మ‌యూర్ న‌టిస్తున్నారు. ఇందులో ఆయ‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో క‌లిసి న‌టిస్తున్నారు. దీని గురించి ఆయ‌న మాట్లాడుతూ ‘‘పరదా’ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేశాను. నా పాత్ర రూప‌క‌ల్ప‌న‌, తెర‌కెక్కించిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. స‌రికొత్త సోష‌ల్ డ్రామాగా ప‌ర‌దా చిత్రం తెర‌కెక్కింది. ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది’’ అన్నారు.

ప్ర‌స్తుతం GA2 నిర్మాణంలో రూపొందుతోన్న బ‌డ్డీ కామెడీ చిత్రంలో న‌టిస్తున్నారు రాగ్ మ‌యూర్‌. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న గ‌రివిడి ల‌క్ష్మి సినిమాలోనూ మ‌యూర్ న‌టిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ప్ర‌సిద్ద బుర్ర‌క‌థ క‌ళాకారిణి గ‌రివిడి లక్ష్మి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘‘భిన్నమైన పాత్రల్లో నటించటం నటుడిగా నాకెంతో ఆనందంగా ఉంది. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌లు నాకు రావ‌టం చాలా హ్య‌పీ. దీని వ‌ల్ల న‌టుడిగా మ‌రింత స్కోప్ పెరుగుతోంది. ప్ర‌ముఖ బ్యానర్స్‌లోనూ సినిమాలు చేస్తున్నాను. దీని వ‌ల్ల నిర్మాణంపై కూడా అవ‌గాహ‌న క‌లుగుతోంది. అద్భుత‌మైన టెక్నీషియ‌న్స్‌తో ప‌ని చేయ‌టం వ‌ల్ల, వారితో క‌లిసి జ‌ర్నీ చేయ‌టం వ‌ల్ల న‌టుడిగా నాలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించే అవ‌కాశం క‌లుగుతోంది’’అని పేర్కొన్నారు రాగ్ మయూర్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus