అనుష్క నటనను మెచ్చుకున్న దర్శకేంద్రుడు

పాత్రకు తగినట్లు అభినయాన్ని పలికించడమే కాదు ఆకారాన్ని సైతం మార్చగల నటి అనుష్క. రుద్రమదేవి లో రాణిగా మెప్పించిన ఈ భామ.. సైజ్ జీరోలో భారీ కాయంతో అద్భుత నటన ప్రదర్శించింది. ప్రస్తుతం బాహుబలి – ది కంక్లూజన్ కోసం శ్రమిస్తూనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న “ఓం నమో వెంకటేశా” సినిమాలో సన్యాసి పాత్ర చేస్తోంది. గత శనివారం ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. ఈ రోజు (మంగళవారం) అనుష్క చిత్రీకరణలో పాల్గొంది.

ఆమె నటనను చూసిన దర్శకుడు అభినందించక ఉండలేక పోయారు. “ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అరుంధతి, బాహుబలి , రుద్రమదేవి ఏ సినిమాలో అయినా తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటినుంచో తనకి నా సినిమా లో తగిన క్యారెక్టర్ ఇవ్వాలని భావించాను. ఇన్నాళ్ళకి ‘ఓం నమో వేంకటేశాయ’ ద్వారా జరిగింది. తన కెరీర్ లో మొదటి సారి భక్తురాలి క్యారెక్టర్ చేస్తుంది. ఆ రోల్ లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.” అని సోషల్ మీడియా వేదికపై చెప్పారు. కింగ్ నాగార్జున అన్నమయ్య, శ్రీ రామ దాసు, షిరిడి సాయి సినిమాల తర్వాత  చేస్తున్నమరో భక్తి రస కథా చిత్రం ఇది. ఈ సినిమాలో నాగ్ హథీ రామ్ బాబా పాత్రకు ప్రాణం పోస్తున్నారు.

ఇందులో అనుష్క కూడా నటిస్తుంది అనగానే నాగార్జున కు జోడీగానే అయి  ఉంటుందని సినీ అభిమానుల్లో ఓ అంచనా ఉంటుంది. కానీ  ఓం నమో వేంకటేశాయ లో అనుష్క నాగార్జున కి జంట గా నటించడం లేదని శత చిత్రాల దర్శకుడు స్పష్టం చేశారు. కొన్ని రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలో వేసిన తిరుమల సెట్ లో చిత్ర షూటింగ్ కొనసాగుతుందని చిత్రబృందం తెలిపింది. ఎ. మహేష్ రెడ్డి తన సొంత ఎఎంఆర్ సాయి కృప ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus